లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ళ జైలు

కేంద్రం లాక్ డౌన్ విషయంలో కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. కొన్ని చోట్ల ఉల్లంఘనలు చోటుచేసుకోవటంతో ఈ అంశంపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్‌డౌన్ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. ప్రాణాంతక వైరస్ విస్తృతంగా ప్రబలకుండా అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
లాక్‌డౌన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపైకి వచ్చే వారికి చెక్ పెట్టాలని కోరారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు చేపట్టవచ్చనే పూర్తి వివరాలతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు పంపింది.ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1965కు చేరగా వీరిలో 151 మంది కోలుకోగా 50 మంది మరణించారు.