‘డుంజో’ చెప్పిన నిజాలు
దేశమంతా..కాదు కాదు ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా పేరు చెపితే వణికిపోతోంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకోవటంతో ఎక్కడివారు అక్కడే గప్ చుప్. ఈ సమయంలో అందరూ ఏమి చేస్తుంటారు?. ఎవరికి తోచిన పని వాళ్లు చేస్తూ ఉంటారు. కానీ ‘డుంజో’ యాప్ పలు సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఆన్ లైన్ కంపెనీ తమ యాప్ ద్వారా ప్రజలకు అవసరమైన మెడిసిన్స్ తోపాటు నిత్యావసరాలు సరఫరా చేస్తుంది. లాక్ డౌన్ కాలంలో ఏ నగరంలో ఎక్కువ మంది ఏమి ఆర్డర్ ఇచ్చారో డుంజో బహిర్గతం చేసింది. ఈ వివరాలు సంచలనంగా కలిగిస్తున్నాయి. ఈ సంస్థ హైదరాబాద్ కన్నా ముంబయ్, చెన్నయ్ నగరాల్లో బాగా పాపులర్. డుంజో గత నెలలో జనాలు ఫార్మసీకి సంబంధించి ఏ వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారన్న విషయాన్ని వెల్లడించింది.
దీని ప్రకారం చెన్నై, జైపూర్వాసులు హ్యాండ్వాష్ను ఎక్కువగా ఆర్డర్ చేశారు. వాళ్లు కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు శుభ్రతే ప్రధాన అవసరమని గుర్తించినట్లున్నారు. బెంగళూరు, పుణె నగరాల్లో ప్రెగ్నెన్సీ కిట్లను అధికంగా డెలివరీ చేశారు. అన్నింటికన్నా భిన్నంగా ముంబైవాసులు ఆర్డర్ చేసినవాటిలో కండోమ్స్ మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ విషయానికొస్తే నగరవాసులు ఐ-పిల్ అనే గర్భనిరోధక మాత్రలను విచ్చలవిడిగా వాడేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని డుంజో చెప్పుకొచ్చింది. ఇదేమి పిల్లలాట కాదని...తాము నిజంగా ఈ విషయాలు చెబుతున్నామని పేర్కొంది.