Telugu Gateway
Latest News

కరోనా అంత తొందరగా వదలదంటున్న డబ్ల్యుహెచ్ వో

కరోనా అంత తొందరగా వదలదంటున్న డబ్ల్యుహెచ్ వో
X

కరోనా వైరస్ కథ ఎప్పుడు క్లోజ్ అవుతుంది. అందరి మదిలో ఇప్పుడు ఒకటే ప్రశ్న. పాత రోజుల్లాగా మళ్ళీ ఎంచక్కా ఎప్పుడు స్వేచ్చగా బయట తిరుగుతాం. విమానాలు ఎక్కి గాల్లో ఎగురుతాం. రైళ్లు, బస్సులు ఎప్పుడు మామూలుగా తిరుగుతాయి. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయి. మాల్స్ మళ్లీ ఎప్పుడు కళకళలాడతాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) మాత్రం తొందర పడి ముందే ఊహల్లోకి వెళ్ళిపోమాకండి అంటోంది. కరోనా..నిను వీడని నేను అనే తరహాలో చాలా కాలం మానవాళిని వేధిస్తుందని హెచ్చరిస్తోంది. చాలా చోట్ల తగ్గినట్లే తగ్గినా మళ్ళీ వైరస్ వస్తుందని..ఇలా సంకేతాలు చాలా చోట్ల కన్పిస్తున్నందున ఇప్పటికిప్పుడే కరోనా విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని దేశాలను హెచ్చరిస్తోంది. పలు దేశాల్లోని ప్రజలు ఇంకెంత కాలం ఈ లాక్ డౌన్ అనే ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఆర్ధిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతుందనే టెన్షన్ లో ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం ముఖ్యమే..అలాగే దేశ ఆర్ధిక వ్యవస్థ ముఖ్యమే. అలాగని సడలింపు ఇస్తే..కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందితే పరిస్థితి ఏంటి? నిజానికి ప్రపంచానికి ఇది పెద్ద సంకటమే.

పలు దేశాలు లాక్ డౌన్ సడలింపులకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అథోనామ్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన చేసిన హెచ్చరికలు అమెరికాను మరింత ఆందోళనకు గురిచేసేవిగా ఉన్నాయి. ఇప్పటికే అమెరికా కరోనాతో అల్లకల్లోలం అవుతోంది. అత్యధిక కేసులు..మరణాలు ఆ దేశంలోనే నమోదు అవువుతున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కరోనా వైరస్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ.. తూర్పు ఐరోపా దేశాల్లో ఇది తీవ్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కరోనా ప్రమాదాన్ని ముందే పసిగట్టిన తాము జనవరి 30నే ప్రపంచ దేశాలను హెచ్చరించినట్లు తెలిపారు. డబ్ల్యుహెచ్ వోకు నిధులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను రాజీనామా చేయాలన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.

Next Story
Share it