Telugu Gateway
Latest News

ఎక్కడి వాళ్ళు అక్కడకు వెళ్లొచ్చు

ఎక్కడి వాళ్ళు అక్కడకు వెళ్లొచ్చు
X

లాక్ డౌన్ లో చిక్కుకున్న వారికి ‘బిగ్ రిలీఫ్’

శుభవార్త. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన పలు వర్గాలకు ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ తో దేశంలోని పలు రాష్ట్రాల్లో చాలా మంది ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతున్నారు. వీరికి ఇప్పుడు ఊరట లభించింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, భక్తులు, పర్యాటకులు, విద్యార్ధులతోపాటు ఇతరులు ఎవరైనా సరే తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి వెళుతున్నారో ఆయా రాష్ట్రాలు..కేంద్ర పాలిత ప్రాంతాలు పరస్పరం చర్చించుకుని వీళ్లను రోడ్డు మార్గం ద్వారా బస్సుల్లో తరలించాలని సూచించారు. అదే సమయంలో భౌతికదూరం పాటించేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీని కోసం నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుందని తెలిపారు. గ్రూపులుగా చిక్కుకుపోయిన వారు రెండు రాష్ట్రాల మధ్య మాట్లాడుకుని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళే ప్రజలను పరీక్షించి అంతా బాగుంటేనే వారిని ప్రయాణానికి అనుమతిస్తారు.

వీళ్లను తరలించే బస్సులను కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని స్పష్టం చేశారు. ఇలా తరలించే మార్గంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా వీరు తరలివెళ్ళేందుకు అనుమతించాల్సి ఉంటుందని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి చేరుకున్నాక స్థానిక వైద్య అధికారులు వారిని పరిశీలించి హోమ్ క్వారంటైన్ లో ఉంచాలన్నారు. ఎవరికైనా మదింపు అవసరం అని భావిస్తే మాత్రం అందరినీ ఓ చోట పెట్టాలని తెలిపారు. వీళ్ళను వైద్య అధికారులు నిర్దేశిత సమయాల్లో పరీక్షిస్తూ ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరితో ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేయించి..వారికి కదలికలను గమనిస్తూ ఉండాలని సూచించారు.

Next Story
Share it