Telugu Gateway
Latest News

లాక్ డౌన్ పై బీసీజీ నివేదిక కలకలం

లాక్ డౌన్ పై బీసీజీ నివేదిక కలకలం
X

‘లాక్ డౌన్ ప్రకటించటం తేలికే. కానీ దాన్ని ఎత్తివేయటమే కష్టం. భారత్ లాంటి అత్యధిక జనాభా గల దేశంలో వైరస్ ను నియంత్రించటం అంత ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదు. అందుకని ఇఫ్పటికిప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయటం అంత సులభమైన అంశం కాదు.’ ఇదీ ప్రముఖ సంస్థ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) చెబుతున్న అంశం. దీంతో మరి ఏప్రిల్ 15 నుంచి అయినా లాక్ డౌన్ ఎత్తేవేస్తారా? లేదా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇఫ్పటికీ తక్కువే అయినా ...ఒక్కసారిగా ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశానికి హాజరైన వారితో దేశ వ్యాప్తంగా పెద్ద కల్లోలం చెలరేగిందనే చెప్పాలి. ఈ తరుణంలో బీసీజీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలోని అంశాలు కలకలం రేపుతున్నాయి. ‘దేశంలో లాక్ డౌన్ ను జూన్‌ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్‌ వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ను అదుపుచేయడం భారత్‌ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్‌ వ్యాప్తి తగ్గకముందే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. మరో పదిరోజుల్లో బయటకు రావొచ్చని అందరూ ఆశపడుతున్న తరుణంలో బీసీజీ నివేదిక ఒక రకంగా షాక్ లాంటిదేఅని చెప్పొచ్చు. ఈ నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లాక్‌డౌన్‌ను పొడిస్తారని కొందరు అభిప్రాయపడుతుండగా... ప్రాంతాలు, వైరస్‌ ప్రభావాన్ని బట్టి దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. దేశంలో వైరస్‌ తొలిదశలో ఉన్న సమయంలోనే మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,567కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు.

Next Story
Share it