Telugu Gateway
Latest News

అమెరికా కొంప ముంచింది అదేనా?

అమెరికా కొంప ముంచింది అదేనా?
X

కొవిడ్ 19 దెబ్బకు అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5 ఉదయం ఆరు గంటలకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,12,245. మరణాల సంఖ్య 8503. ఒక్క న్యూయార్క్ లోని కరోనా కేసులు 1,14,174కు చేరాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. అయితే దీనికంతటి కారణం ఎవరు?. ఎందుకు అమెరికాలో కరోనా కేసులు ఇంతగా పెరిగిపోతున్నాయి. ఎన్నో వనరులు ఉండి..ఎంతో అత్యుత్తమ వైద్య సౌకర్యాలు ఉండి కూడా అగ్రరాజ్యం అమెరికా చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది. అంటే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వాకమే కారణం అంటోంది ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక. చైనాలో కరోనా వెలుగు చూసిన తర్వాత అమెరికా ఏ మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటం, ప్రయాణికులపై ఆంక్షలు పెట్టకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించింది. అందుకు అనుగుణంగా గణాంకాలను కూడా ప్రస్తావించింది. చైనాలోని వుహాన్ లో కరోనా కేసులు వెల్లడైనప్పటి నుంచి అమెరికాకు ఆ దేశం నుంచి ఏకంగా 4.30 లక్షల రావటమే ఈ విపత్తుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ట్రంప్ ఆలశ్యంగా మేల్కొని ప్రయాణాలపై ఆంక్షలు విధించే నాటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అంతే కాదు..ట్రంప్ ఆంక్షలు విధించాక కూడా 40 వేల మంది అమెరికాలో ప్రవేశించారని పేర్కొంది. చైనాలో గత ఏడాది చివరిలోనే కరోనా కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే జనవరి 15 వరకూ కూడా చైనా నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా అమెరికాలోకి అనుమతించటం వల్లే పరిస్థితి అదుపు తప్పిందని చెబుతున్నారు. తనిఖీలు కూడా కొన్ని విమానాశ్రయాల్లోనే చేయటం వల్ల వైరస్ ను దేశంలోకి రాకుండా అడ్డుకోవటం సాధ్యం కాలేదని టైమ్స్ పేర్కొంది. ఒక్క వుహాన్ నుంచి అమెరికాలోకి నాలుగు వేల మంది వచ్చారని తెలిపారు.

Next Story
Share it