Telugu Gateway
Latest News

స్టాక్ మార్కెట్లో ఐదు లక్షల కోట్లు ఆవిరి

స్టాక్ మార్కెట్లో ఐదు లక్షల కోట్లు ఆవిరి
X

ఒక వైపు కరోనా భయాలు. మరో వైపు ఎస్ బ్యాంక్ సంక్షోభం. ఎప్పుడు ఏ వార్త ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో అన్న టెన్షన్. వారంలో ట్రేడింగ్ కు చివరి రోజైన శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్లో మరోసారి కల్లోలం నెలకొంది. ప్రారంభంలో సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లు నష్టపోయింది. ఓ దశలో కొంత రికవరీ అయినా పదిన్నర సమయానికి ఇంకా 1222 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఈ భారీ పతనంతో ఇన్వెస్టర్లు ఏకంగా ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద నష్టపోయినట్లు ఓ అంచనా. ఎలాంటి రిస్క్ తీసుకోవటానికి ఆసక్తి చూపని ఇన్వెస్టర్లు ముందు అయితే అయినకాడికి అమ్ముకుని బయటపడతామనే ఆలోచనలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అంతే కాదు..ఈ డౌన్ ట్రెండ్ ఇప్పటికిప్పుడు ఆగిపోతుందా లేక మరికొంత కాలం కొనసాగుతుందా? అన్న టెన్షన్ ఇన్వెస్టర్లను వేధిస్తోంది. అయితే ఇదే పరిస్థితి మరికొంత కాలం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. గత శుక్రవారం నాడు సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనం అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయింది. బ్యాంకు షేర్లతోపలు అన్ని రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సైతం డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది.

Next Story
Share it