Telugu Gateway
Latest News

అమెరికా టూ చైనా.. ఒక్క విమాన టిక్కెట్ 15 లక్షలు!

అమెరికా టూ చైనా.. ఒక్క విమాన టిక్కెట్ 15 లక్షలు!
X

అమెరికా నుంచి ఎలాగైనా బయటపడాలి. అందుకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇది అగ్రరాజ్యం అమెరికాలో చదువుకుంటున్న కొంత మంది చైనా విద్యార్ధుల టెన్షన్. అది వారిలో ఎంతలా ఉంది అంటే ఏకంగా ఒక్కో టిక్కెట్ కు 15 లక్షల రూపాయలు చెల్లించటానికి కూడా వాళ్లు వెనకాడటం లేదు. అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుండటంతో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ముందు అమెరికా నుంచి బయటపడితే చాలు..తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనేలా కొంత మంది విద్యార్ధులు కలసి చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. 14 సీట్ల బొంబార్డియర్6000 ప్రైవేట్ జెట్ ద్వారా కొంత మంది విద్యార్ధులను తరలించినట్లు అమెరికాకు చెందిన ఎయిర్ ఛార్టర్ సంస్థ ఒకటి తెలిపింది. దీని కోసం ఒక్కో విద్యార్ధి నుంచి సుమారు 15 లక్షల రూపాయల వరకూ వసూలు చేశారు. ఇప్పటికే ప్రపంచంలోని అగ్రదేశాలు అన్ని వాణిజ్య విమాన సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో సంపన్న వర్గాలకు చెందిన వారి పిల్లలు ఎలాగైనా అమెరికాను వీడేందుకు ప్రైవేట్ ఫ్లైట్స్ మార్గాన్ని ఎంచుకున్నారు.

అయితే చైనాలోని పలు ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రైవేట్ ఫ్లైట్స్ కు అనుమతులు నిరాకరిస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం ఎలాగోలా ఆంక్షల బారి నుంచి తప్పించుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి మరీ అమెరికా నుంచి బయటపడ్డారు. కరోనా వైరస్ పుట్టిన చైనాలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతో మెరుగవగా...అమెరికాలో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటడంతో ఆ దేశ ప్రజలు హడలిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం పలు ప్రైవేట్ చార్టెడ్ విమాన సంస్థలు న్యూయార్క్, బోస్టన్ ల నుంచి షాంఘై, శాన్ జోస్ నుంచి హాంకాంగ్, లాస్ఏంజెల్స్ నుంచి గ్వాంగ్జో కు సర్వీసులు నడిపాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పుడు చైనాలోని అగ్రశ్రేణి విమానాశ్రయాలు అన్నీ కూడా ఛార్టెడ్ ఫ్లైట్స్ ను కూడా నిలిపివేశాయి. విదేశాల నుంచి వచ్చేవారితోనే వైరస్ విస్తరిస్తుందనే కారణంతో ఆ ఆంక్షలు విధించారు.

Next Story
Share it