Telugu Gateway
Latest News

దేశానికి తాళం..21 రోజులు...తప్పదు

దేశానికి తాళం..21 రోజులు...తప్పదు
X

ఊహించినట్లుగానే ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. దేశాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఇది తప్పదన్నారు. కరోనా అంటే కోయి రోడ్డు పర్ న నికలే (ఎవరూ రోడ్డుపైకి రావద్దు) అని ఓ పోస్టర్ ను ప్రదర్శించి మరీ చూపారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూలాంటిదే అన్నారు. లాక్ డౌన్ ప్రతి ఇంటికి లక్షణ రేఖ కావాలి. ఎవరూ కూడా ఇళ్లు విడిచి బయటకు రావొద్దని కోరారు. కరోనా నియంత్రణకు సామాజిక దూరం ఒక్కటే శరణ్యం అని వ్యాఖ్యానించారు. ఇది ఓ సైకిల్ అని..దీన్ని అడ్డుకోవటానికే ఇదే మార్గం అని పేర్కొన్నారు. 21 రోజులు పూర్తిగా ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రదాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు...‘ప్రాణం ముఖ్యం. ప్రాణం ఉంటేనే ప్రపంచం ఉంటుంది. ఈ 21 రోజుల్లో పరిస్థితి చక్కపడక పోతే 21 ఏళ్ళు దేశం వెనక్కి పోతుంది. ఇళ్ళలో నే ఉండండి. బయటికి రావడం అనే విషయాన్ని మరిచిపోండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో )నివేదిక చెబుతోంది. రోగం అగ్ని కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది.

ఇటలీ... అమెరికా లో వైద్య సేవలు చాలా ఆధునికంగా ఉన్నా కరోనా వ్యాప్తి అడ్డుకోలేకపోయాయి. మనం కూడా పంథా మార్చుకోవాలి. ఏం జరిగినా ఇంట్లోనే ఉండాలి. దీని వ్యాప్తి ని అడ్డుకోవాల్సిందే. ప్రధాని మోడీగా చెప్పటం లేదు. మీ ఇంటి సభ్యుడిగా చెబుతున్నా. అన్ని రాష్ట్రాల తొలి ప్రాధాన్యత వైద్యమే కావాలి. కరోనా నియంత్రణకు 15 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. జలుబు, దగ్గు, ఉబ్బసం ఉంటే సొంత వైద్యం పనికి రాదు. 24 గంటలు పనిచేస్తున్న వైద్యులు, మీడియాకు ధన్యవాదాలు. కరోనా మొదటి లక్ష మందికి చేరడానికి 67 రోజులు పట్టింది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లోనే 3 లక్షలకు చేరింది. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకుంటే మనచేతుల్లో ఏమి ఉండదు.

ప్రజలంతా ఒకే పని చేయాలి.. ఇళ్లలోనే ఉండాలి. సంక్షోభ సమయంలో భుజం భుజం కలిపి పనిచేయాలి. కేంద్ర, రాష్ట్రాలు నిరంతరం ఇదే విషయంపై ఆలోచిస్తున్నాయి. నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. కేంద్ర, రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులు పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడటమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. ఎలాంటి పుకార్లు, వదంతులు, మూఢనమ్మకాలు నమ్మవద్దు. కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చే మార్గదర్శకాలు పాటించాలి. ప్రధాని నుంచి గ్రామవాసుల వరకు సామాజిక దూరం పాటించాలి. కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయమిది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాల్సిన సమయమిది.

Next Story
Share it