యెస్ బ్యాంకు ఖాతాదారులకు ఊరట

యెస్ బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం భరోసా ఇచ్చింది. బ్యాంకులో ఖాతాదారులు పెట్టిన డబ్బు అంతా సురక్షితంగా ఉంటుందని..ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యెస్ బ్యాంకు విషయంలో తాము నిత్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ)తో టచ్ లో ఉన్నామని..త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు ఆర్ బీఐ కూడా రంగంలో దిగి..భరోసా ఇఛ్చే ప్రయత్నాల చేసింది. సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆర్ బిఐ హామీ ఇచ్చిందని, ఈ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌బీఐ అంగీకరించిందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఐఎల్‌ఎఫ్‌ఎస్, వొడాఫోన్ వంటి కంపెనీలకు యస్ బ్యాంక్ భారీ రుణాలిచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
యస్ బ్యాంక్‌లో ఇంతటి భారీస్ధాయిలో సమస్యలకు దారితీసిన పరిస్ధితులు, బాధ్యులెవరనే దానిపై ఆర్ బిఐ నిగ్గుతేల్చాలని, వారిపై సత్వర చర్యలు చేపట్టేందుకు కేంద్ర బ్యాంక్ యస్ బ్యాంక్ పరిస్ధితులను తక్షణం మదింపు చేయాలని ఆమె పేర్కొన్నారు. యస్ బ్యాంకు ఆస్తులు, అప్పులు..ఉద్యోగులు వారి వేతనాలపై సంక్షోభ ప్రభావం ఉండబోదని మంత్రి భరోసా ఇచ్చారు. కనీసం ఏడాది వరకూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవని అన్నారు. త్వరలో యెస్ బ్యాంకు బోర్డులో మార్పులు చేయనున్నారు. ఎస్ బిఐ నేతృత్వంలో కన్సార్టియం యెస్ బ్యాంకులో మెజారిటీ వాటాను తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.