Telugu Gateway
Andhra Pradesh

జీఎంఆర్ కే భోగాపురం విమానాశ్రయం

జీఎంఆర్ కే భోగాపురం విమానాశ్రయం
X

ఏపీ మంత్రివర్గం బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 27న ఉగాది సందర్భంగా రాష్ట్రంలో పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం నలభై వేల ఎకరాల భూమిని సేకరించామని మంత్రి పేర్ని నాని చెప్పారు.ఈ ఇళ్ల స్థలాలను స్టాంప్ పేపర్ మీద రిజిస్టర్ చేసి ఇవ్వాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.ఈ భూమిని ఐదేళ్ల తర్వాత తనఖా పెట్టుకోవడానికి గాని, అమ్ముకోవడానికి గాని అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోట్ల రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆయన చెప్పారు. వీటిని వైఎస్ ఆర్ జగనన్న కాలనీలుగా పిలుస్తామని ఆయన చెప్పారు. ఈ ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసే అదికారం ఎమ్.ఆర్.ఓ లకు ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు.2010 నాటి ప్రశ్నావళినే ఎన్.పిఆర్ ను అమలు చేయాలని ,అంతవరకు వాటిని నిలుపుదల చేయాలని కూడా నిర్ణయించినట్లు నాని చెప్పారు. మచిలీపట్నం,రామాయంపట్నం, భావనపాడు ఓడరేవుల నిర్మాణానికి సంబందించిన చర్చ మంత్రివర్గ సమావేశంలో జరిగిందని మంత్రి పేర్ని నాని అన్నారు.

రామాయంపట్నం కు పరిది సమస్య ఉన్నందున గతంలో దానిపై ఆ ఇబ్బంది లేకుండా చేయకుండా తీసుకున్న నిర్ణయాన్ని రాటిఫై చేశామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జీఎంఆర్ కు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదించిందని ఆయన చెప్పారు. ఇక్కడ 2300 ఎకరాలను ఎయిర్ పోర్టుకు ఇస్తామని, మిగిలిన 500 ఎకరాలను ప్రభుత్వం వద్ద ఉంచుకుంటుందని ఆయన చెప్పారు. టెండర్లలో జీఎంఆర్ ఎంపిక అయిందని ఆయన చెప్పారు. రైతుల విత్తనాలకు అవసరమైన ఆర్దిక వనరులు సమకూర్చుకోవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. విటిపిఎస్ లోని800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను ,కృష్ణపట్నం దర్మల్ ప్లాంట్ ను పూర్తి చేయడానికి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి నిర్ణయం చేశామని నాని తెలిపారు.

Next Story
Share it