Telugu Gateway
Latest News

భారత్ లో 73కు చేరిన కరోనా కేసులు

భారత్ లో 73కు చేరిన కరోనా కేసులు
X

భారత్ లోనూ కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. తొలుత పరిమిత సంఖ్యలో ఉన్న ఈ కేసులు విదేశీ ప్రయాణికుల రూపంలో దేశంలోకి వస్తున్నాయి. దీంతో ఏకంగా నెల రోజుల పాటు భారత్ పలు దేశాలకు చెందిన వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ లో 73 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. ఇందులో 56 మంది భారతీయులు అయితే..మరో 17 మంది విదేశీయులు. ఇప్పటివరకూ దేశంలో 10.57 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు సర్కారు చెబుతోంది.

మహారాష్ట్రలోనూ కొత్తగా రెండు కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 11కి చేరింది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) ప్రకటించింది. అత్యవసరం అయితే తప్ప దేశం నుంచి ఎవరూ విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దన కేంద్రం సూచించింది. అదే సమయంలో పుకార్లను వ్యాప్తి చేయవద్దని ప్రజలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరారు. తెలంగాణలో ఇఫ్పటివరకూ నమోదైన ఒక్క పాజిటివ్ కేసు బాధితుడు కూడా పూర్తిగా రివవరి అయ్యాడు.

Next Story
Share it