Telugu Gateway
Latest News

యెస్ బ్యాంకు రానా కపూర్ అరెస్ట్

యెస్ బ్యాంకు రానా కపూర్ అరెస్ట్
X

యెస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ అరెస్ట్ జరిగింది. తాజాగా యెస్ బ్యాంకు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) నెల రోజుల పాటు బ్యాంకు కార్యకలాపాలపై మారిటోరియం విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ జోక్యంతో ఇప్పుడు యెస్ బ్యాంకులో వాటాలు తీసుకోవటానికి దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్ బిఐ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అక్రమ నగదు చెలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ రానా కపూర్ ను అదుపులోకి తీసుకున్నారు. గత రెండు రోజులుగా ఆయన నివాసంలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు ఆయన పై కేసు నమోదు చేశారు. విచారణలో ఏ మాత్రం రానా కపూర్ సహకరించకపోవటంతోనే అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

యెస్ తీవ్ర సంక్షోభంలో కూరుపోవటానికి ప్రధాన కారణం ఆయనే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంకు లావాదేవీల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకల్లో కూడా ఆయన పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. యెస్ బ్యాంకు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఖాతాదారుల సొమ్ముకు ఎలాంటి ఢోకాలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ఇవ్వటం ఈ వ్యవహారంలో కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. యెస్ బ్యాంకు అనిల్ అంబానీ గ్రూపుతోపలు పలు కుంభకోణాల్లో ఉన్న సంస్థలకు భారీ ఎత్తున రుణాలు మంజూరు చేసినట్లు చెబుతున్నారు.

Next Story
Share it