Telugu Gateway
Latest News

ఆమెరికాతో ఆడుకుంటున్న ట్రంప్!

ఆమెరికాతో ఆడుకుంటున్న ట్రంప్!
X

చైనా..ఇటలీలను దాటిన అమెరికా కరోనా కేసుల సంఖ్య

ప్రతి దేశం కరోనా నుంచి తమ ప్రజలను ఎలా కాపాడాలా అనే కసరత్తు చేస్తోంది. అందరూ తమ తమ దేశ ప్రజలను ఆదుకోవాలని చూస్తుంటే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆ దేశ ప్రజలతో ఆడుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిపుణుల సూచనలను పెడచెవిన పెట్టిన ఆయన దేశాన్ని ఇప్పుడు కరోనా సంక్షోభంలోకి నెట్టారు. ఎంత మంది చెప్పినా లాక్ డౌన్ కు నో అనటంతో ఇప్పుడు అమెరికా కరోనా వైరస్ కరాళనృత్యంతో విలవిలలాడుతోంది. అది ఎంతలా అంటే కరోనా వైరస్ పుట్టిన చైనాను దాటి..విపరీతంగా మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్ లను కూడా దాటి వెళ్లింది. ముఖ్యంగా అమెరికా లో నమోదు అవుతున్న కేసులు ఆ దేశ ప్రజలను ద్రిగ్భాంతికి గురిచేస్తోంది. కేసుల సంఖ్య చైనా, ఇటలీ, స్పెయిన్ లను దాటినా మరణాల సంఖ్య మాత్రం ఆ స్థాయిలో లేకపోవటం ఒక్కటే కాస్తలో కాస్త ఆ దేశ ప్రజలకు ఊరట కలిగించే అంశం. శుక్రవారం ఉదయం నాటికి అందిన సమాచారం ప్రకారం అ దేశంలో కరోనా కేసుల సంఖ్య 85,594కు చేరి చైనాను అధిగమించింది.

దేశంలో 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో గురువారం ఒక్కరోజే 17వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక వాణిజ్య రాజధానిగా పేరొందిన న్యూయార్క్‌ లో వైరస్‌ తీవ్రత రోజురోజుకూ విజృభిస్తోంది. మరోవైపు వైరస్‌ను కట్టడిచేయడంలో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇటలీలో కరోనా కేసులు 80,589, స్పెయిన్ లో 57,786, జర్మనీ 43,938 కేసులు నమోదు అయ్యాయి.

ఇక అత్యధిక మరణాలతో ఇటలీ చిగురుటాకులా వణుకుతోంది. ఇటలీలో 8,215, స్పెయిన్‌ 4,365, చైనా 3,292, ఇరాన్‌ 2,234 మరణాలను నమోదు అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 24 వేలుకు పైగా దాటిపోయింది. ఇక భారత్‌లో 727 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 16కు చేరింది. మిగిలిన దేశాలతో పోలిస్తే కరోనా నిర్ధారణ పరీక్షలను అమెరికా భారీ స్థాయిలో పెంచింది. ఎనిమిది రోజుల్లోనే అమెరికాలో 2,20 లక్షల మందిని పరీక్షించినట్లు వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ కట్టడి అంశంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Next Story
Share it