Telugu Gateway
Latest News

చైనాలో భారీగా పెరిగిన విడాకుల కేసులు..కారణం తెలుసా?

చైనాలో భారీగా పెరిగిన విడాకుల కేసులు..కారణం తెలుసా?
X

కరోనా వైరస్ ఎంత పని చేసింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడ ప్రజల ప్రాణాలు తీయటమే కాదు...ఏకంగా చైనాలో ఎన్నో కాపురాలను కూడా కూల్చేస్తోంది. వైరస్ కు..కాపురాలు కూలిపోవటానికి సంబంధం ఏంటి అంటారా?. అక్కడే ఉంది అసలు విషయం. ప్రపంచంలోనే తొలిసారి ఈ వైరస్ బయటపడింది చైనాలోనే అన్న సంగతి తెలిసిందే. ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ‘వర్క్ ఫ్రం హోమ్’ కాన్సెప్ట్ ను కఠినంగా అమలు చేసింది. ఎవరికి వారు ఇళ్ళు దాటి బయటకు రాకుండా పని చేయాలని ఆదేశించారు. దీని వల్ల భార్యా, భర్తలు ఎక్కువ కాలం ఇంట్లోనే కలసి గడిపారు. దీంతో వీళ్ళ మధ్య ఎన్నో వివాదాలు, గొడవలు. ఇవే ఇప్పుడు విడాకులకు కారణం అవుతున్నాయి. ఇది ఏమీ కల్పిత కథ ఏ మాత్రం కాదు. చైనాలో విడాకుల కేసుల సంఖ్య చూశాక అక్కడి అధికారులు చెబుతున్న మాటలే ఇవి. కరోనా వైరస్ ప్రభావం లేని మామూలు రోజుల్లో అయితే ఉద్యోగానికి వెళ్లి ఎప్పుడో సాయంత్రమో, రాత్రి పూటో ఇంటికి తిరిగొచ్చేవారు. దక్షిణ డాజు అనే ప్రాంతంలో ఈ ఫిబ్రవరి 24 నుంచి 300 మంది జంటలు మ్యారేజీ రిజిస్ట్రీలో విడాకుల కోసం అపాయింట్ మెంట్స్ తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.

విడాకుల సంఖ్య గణనీయంగా పెరగటానికి జంటలు ఎక్కువ సమయం ఒకే చోట కలసి ఉండటమే కారణం అని చెబుతున్నారు. కరోనా వైరస్ రావటానికి ముందుతో పోలిస్తే ప్రస్తుతం విడాకుల కేసులు గణనీయంగా పెరిగాయని లూ అనే అధికారి స్థానిక మీడియాకు తెలిపినట్లు ‘డెయిలీ మెయిల్ ’ కథనం వెల్లడించింది. యువ జంటలు ఎక్కువ సమయం కలసి గడిపిన సమయంలో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రమైన వాగ్వాదాలు చోటుచేసుకున్నాయని..ఇవే విడాకుల వరకూ దారితీస్తున్నాయని తెలిపారు. కరోనా కారణంగా చాలా చోట్ల మ్యారేజ్ రిజిస్ట్రీ ఆఫీసులు మూసివేసి ఉన్నాయని...వైరస్ సద్దుమణిగిన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఓ జిల్లా ఆఫీసుకు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 14 విడాకుల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు జంటలు అత్యంత సన్నిహితంగా ఎక్కువ సమయం కలసి ఉండటం లాభమా..నష్టమా అనే అంశంపై చర్చలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

Next Story
Share it