డెక్కన్ క్రానికల్ ప్రింట్ ఎడిషన్ బంద్..మార్చి 31 వరకూ

కరోనా వైరస్ ప్రభావం మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇఫ్పటికే ఆర్ధిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ దశలో ప్రకటనలు కూడా మీడియాకు రావటం గగనమే అయింది. అందుకే పలు అగ్రశ్రేణి పత్రికలు పేజీల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. దీంతోపాటు పత్రికల వల్ల కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే ఆందోళనలతో పాఠకులు పత్రికలను తీసుకోవటానికి ఆసక్తి చూపటంలేదు. దీంతోపాటు పత్రికల పంపిణీదారులు కూడా వీటి సరఫరాకు నిరాకరిస్తున్నారు.
ఇఫ్పటికే మీడియా సంస్థలకు ఇవి అవగతం అయ్యాయి. ఈ తరుణంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ మార్చి 31 వరకూ ప్రింట్ ఎడిషన్ ఉండదని ప్రకటించింది. అయితే అదే సమయంలో ఈ పేపర్ మాత్రం పాఠకులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఇదే గ్రూపునకు చెందిన ఆంధ్రభూమి పత్రిక ప్రింటింగ్ ను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన తెలుగుపత్రికలు ఇదే బాటలో పయనిస్తాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే. అయితే ఉగాదికి పత్రికలు సెలవు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.