Telugu Gateway
Latest News

నిర్భయకు న్యాయం..ఎట్టకేలకు ఉరి అమలు

నిర్భయకు న్యాయం..ఎట్టకేలకు ఉరి అమలు
X

తప్పు చేసింది ఎవరో తెలుసు. ఎంత దారుణంగా చేశారో తెలుసు. కానీ వాళ్లకు శిక్ష అమలు ఛేయటానికి ఏడేళ్లు పట్టింది. ఇందుకు దోషులు వేసిన ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. చివరి నిమిషం వరకూ ఉరిని తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు. చివరకు అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు కూడా తట్టారు. ఇంత కాలం కలసొచ్చిన కాలం ఇక ఎదురుతిరిగింది. ఇక చాలు...చాలించమని చెప్పింది. ఇప్పటికే ఎక్కువ సమయం ఇచ్చామని..ఇక ఇచ్చేదిలేదని న్యాయస్థానాలు తేల్చిచెప్పటంతో నిర్భయ దోషుల ఉరి అమలు అయింది. శుక్రవారం తెల్లవారుజామున దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఉరి అమలు క్షణాలు రానే వచ్చాయి..ఉరి శిక్ష అమలు ప్రక్రియ పూర్తయింది. ఈ ఉరికి సంబంధించి చోటుచేసుకున్న వాయిదాలు చూసిన వారు..చివరి క్షణం వరకూ ఇప్పటికైనా అమలు అవుతుందా లేదా అనే అనుమానాలతోనే ఉన్నారు. కానీ ఆ అనుమానాలు అన్నీ పటాపంచలు అయిపోయాయి. దేశంలోని కోట్లాది మంది కోరిక నెరవేరింది. ఎప్పటిలాగానే ఉరిని వ్యతిరేకించే వారి వాదనలు వాళ్లు చేస్తూనే ఉన్నారు. ఈ ఉరితో దేశంలో రేప్ లు ఆగిపోతాయా? అని ప్రశ్నించే వాళ్ళూ ఉన్నారు.

ఏది ఏమైనా నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు దేశంలో మెజారిటీ ప్రజలు కోరుకున్నదే. ఇప్పుడు అదే అమలు అయింది. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు అమలు అయిన క్షణాలు ఇవి. ఈ కేసులో దోషులుగా తేలిన ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహార్‌ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్‌ నుంచి వచ్చిన తలారి పవన్‌.. మనీలా తాళ్లతో ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్‌ కేంద్ర కారాగారంలో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఒకేసారి ఉరి తీయడం ఇదే మొదటిసారి. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం ప్రకటించారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని వ్యాఖ్యానించారు. 2012 డిసెంబరు 17 వీళ్ళ నలుగురు ఢిల్లీలో ఓ యువతిని అత్యంత పాశవికంగా రేప్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it