కరోనా ఎఫెక్ట్..మీడియాకూ చిక్కులు
కరోనా ప్రభావం మీడియాపై కూడా పడుతోంది. ముఖ్యంగా పలు పత్రికల సరఫరా నిలిచిపోతోంది. హైదరాబాద్ వంటి నగరంలో చాలా చోట్ల మంగళవారం నాడు పత్రికలు వేసుకోవటానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. కొన్ని చోట్ల అయితే అపార్ట్ మెంట్లలో పత్రికలను అనుమతించటానికి అసోసియేషన్లు నిరాకరిస్తున్నాయి. పత్రికలతోనూ కరోనా వైరస్ విస్తరించే అవకాశం ఉందనే ప్రచారం జరగటంతో కొంత మంది భయపడి పత్రికలకు నో చెబుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కొన్ని ప్రధాన పత్రికల పంపిణీ నిలిచిపోయింది. నగరంలోని పలు షాపుల్లోకి కొన్ని పత్రికలు మాత్రమే వచ్చాయి. కొన్ని చోట్ల పోలీసులు కూడా ఉదయం పూట పత్రికల సరఫరా వద్ద ఆంక్షలు పెట్టడంతో అందుబాటులో ఉన్న పత్రికలను తీసుకుని షాపుల వాళ్లు బయటపడ్డారు. వాస్తవానికి తెలంగాణ అంతటా లాక్ డౌన్ ప్రకటించిన మీడియాను అత్యవసర సేవల కింద ప్రకటించారు. కానీ కొన్ని చోట్ల మా ఇళ్లకు పేపర్లు వేయవద్దు అని కొంత మంది చెబుతుంటే..మరికొన్ని చోట్ల మాత్రం కరోనా కారణం తాము కొన్ని రోజులు పత్రికల సరఫరా చేయలేమని..దయచేసి పరిస్థితిని అర్ధం చేసుకోవాలని కోరుతూ లేఖలు పెట్టారు.
అసలే కరోనా ఎఫెక్ట్ కారణంగా పత్రికలకు వచ్చే ప్రకటనలు తగ్గిపోయాయి. ఇదే కారణంతో ప్రధాన పత్రికలు చాలా వరకూ మెయిన్ ఎడిషన్లతో పాటు ట్యాబ్లాయిడ్ ల్లో పేజీల్లో కోత పెట్టాయి. ఇప్పుడు పత్రికల సరఫరా కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటం మీడియా యాజమాన్యాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకు వచ్చిన రిస్క్ అనే కారణంతో చాలా మంది ఆన్ లైన్ లోనే పేపర్లను చదువుతున్నారు. దీనికి తోడు వాట్సప్ గ్రూపుల్లో కొంత మంది పీడీఎఫ్ పార్మాట్ లో అన్ని పేపర్లను వేయటం కూడా మీడియాపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తెలుగుతో పాటు ఇంగ్లీష్ పత్రికల పంపిణీ కూడా నిలిపివేశారు. హైదరాబాద్ లో చాలా చోట్ల 80 నుంచి 90 శాతం వరకూ పంపిణీకి బ్రేక్ పడిందని సమాచారం.