ఇరాన్ లో 250 మంది భారతీయులకు కరోనా

కరోనా కలకలం భారత్ లో అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ఈ కేసుల సంఖ్య పెరగటం ఒకెత్తు అయితే...ఇరాన్ లో ఏకంగా 250 మంది భారతీయులకు కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 137 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. విదేశాలలోని భారతీయుల యోగక్షేమాల కోసం కొత్తగా ఓ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 72 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఆప్ఘనిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేషియాల నుంచి భారత్‌కు ప్రయాణీకుల రాకను మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూర్తిగా నిషేధించింది.
ఈనెల 31 వరకూ ఇది అమల్లో ఉంటుందని, పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. ఐరోపా దేశాలు, టర్కీ, బ్రిటన్ ప్రయాణీకులపై కూడా భారత్ ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఏప్రిల్ 2వ తేది వరకు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా 142 దేశాలకు పాకిన కరోనా... 7000 మంది ప్రాణాలను బలిగొంది. 1,70,000 మందికి కరోనా సోకింది.