రాజ్యసభ ఎన్నికలు వాయిదా
వాయిదాలే..అన్నీ వాయిదాలే. ఎందుకంటే ఎక్కడ చూసినా కరోనా భయమే. దీంతో ఎంతటి కీలకమైన పనులైనా వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో రాజ్యసభ ఎన్నికలు కూడా చేరాయి. దేశమంతటా కరోనా వైరస్ భయోత్పాతం సృష్టిస్తుండటంతో ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 26న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయించనున్నారు. దేశ వ్యాప్తంగా 55 సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, 37 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
ఇందులో తెలంగాణలోని రెండు సీట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పోటీ లేకపోవటంతో కె ఆర్ సురేష్ రెడ్డి, కే. కేశవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో మాత్రం నాలుగు సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాస్తవానికి సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఈ నాలుగు సీట్లు అధికార వైసీపీకే దక్కుతాయి. కానీ టీడీపీ వర్ల రామయ్యను బరిలో దింపటంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. వైసిపి తరపున మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబాబోస్, అయోద్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు పోటీలో ఉన్న విషయం తెలిసిందే.