Telugu Gateway
Latest News

గోడలు కట్టుకుంటున్న ‘గ్లోబల్ విలేజ్’

గోడలు కట్టుకుంటున్న ‘గ్లోబల్ విలేజ్’
X

భారత్, అమెరికాతో పాటు పలు దేశాలు ఇదే బాటలో!

ప్రపంచం మరింత అనుసంధానం అవటాన్నే ‘గ్లోబల్ విలేజ్’గా వ్యవహరిస్తారు. సాంకేతికంగా..మీడియాపరంగా..విమాన కనెక్టివిటి పరంగా గత రెండు దశాబ్దాలుగా విప్లవాత్మకమార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఏ మూలన ఏ కార్యక్రమం జరిగినా దేశంలోని ఓ మారుమూల ప్రాంతంలో కూర్చుని కూడా వీక్షించే వెసులుబాటు ఎప్పుడో వచ్చింది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ ఇప్పుడు ‘గ్లోబల్ విలేజ్’కు గోడలు కడుతోంది. పలు దేశాలు బాబూ.. మా దేశంలోకి రావొద్దు అంటూ ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటివరకూ ఏదో షరామామూలు ప్రకటనలతో వదిలేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) కూడా కరోనా వైరస్ ఓ మహమ్మారిగా ప్రకటించింది. దేశాలు అన్నీ మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీంతో పలు దేశాలు విమానప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. భారత్ అయితే ఏకంగా నెల రోజుల పాటు పలు దేశాలకు చెందిన వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక మినహాయింపులు ఉన్న వారు తప్ప...భారతీయులు అయినా ఈ నెల రోజుల్లో దేశంలోకి అనుమతించేదిలేదని ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ జాబితాలో ఇటలీ, ఇరాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలు ఉన్నాయి. ఇప్పటికే జారీ చేసిన వీసాలు కూడా చెల్లుబాటు కావని తేల్చిచెప్పింది. తదుపరి ఆదేశాల వెలువడే వరకూ ఈ దేశాల నుంచి భారత్ లో కి ఎవరినీ అనుమతించారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలకు పలు ఎయిర్ లైన్స్ సంస్థలు తమ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఆ పని చేశాయి. కొత్తగా మరిన్ని సర్వీసులను నిలిపివేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే బాటలో పయనించింది. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ ఇప్పటికే వందకు పైగా దేశాల్లో విస్తరించిన సంగతి తెలిసిందే. యూరప్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణాలన్నింటినీ 30 రోజులు నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటించారు.

నెల రోజుల పాటు యూరప్‌ దేశాల నుంచి అమెరికాకు రాకపోకల్ని రద్దు చేశారు. కరోనావైరస్‌ను అడ్డుకునే చర్యల్లో భాగంగానే ఈ తాజా ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నియంత్రణలు చాలా కఠినమే అయినప్పటికీ, తప్పనిసరి అని చెప్పారు. ‘మన దేశంలోకి మరిన్ని కొత్త కేసులు ప్రవేశించకుండా, రాబోయే 30 రోజుల పాటు యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలను రద్దు చేస్తున్నాం’ అని ట్రంప్ చెప్పారు. ఈ కొత్త నిబంధనలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. యూకే వ్యాప్తంగా 460 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇటలీలో వైరస్ విజృంభించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it