అనిల్ అంబానీకి ఈడీ సమన్లు

అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీకి మరో షాక్. ఆయనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. యెస్ బ్యాంకుకు సంబంధించిన వ్యవహారంలో ఈ నోటీసులు జారీ చేయటం విశేషం. యెస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ రూ 12,800 కోట్లు రుణాలు పొందింది. ఇవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఈ రుణాలకు సంబంధించి ప్రశ్నించేందుకు అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా తమకు సమయం కావాలని ఆయన కోరారు. అనిల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్‌ఎఫ్‌ఎస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, వొడాఫోన్ తదితర కంపెనీలకు యెస్ బ్యాంకు భారీ ఎత్తున రుణాలు మంజూరు చేసింది.
యెస్ బ్యాంక్ ఇచ్చిన ఈ రుణాల వసూళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 6న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంక్‌లో పెట్టుబడులకు పలు ప్రైవేట్ బ్యాంకులు, సంస్థలు ముందుకురావడంతో పునరుద్ధరణ ప్రణాళిక ఊపందుకుంది. దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకు అయిన ఎస్ బిఐ తోపాటు పలు ప్రైవేట్ బ్యాంకులు కూడా యెస్ బ్యాంకు పునరుద్ధర ప్రణాళికలో భాగస్వామ్యం పంచుకోవటానికి ముందుకొచ్చాయి. మరి అనిల్ అంబానీ ఈ వ్యవహారంలో ఎలా బయటపడతారో వేచిచూడాల్సిందే.