Telugu Gateway
Andhra Pradesh

హాట్ హాట్ గా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

హాట్ హాట్ గా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
X

ప్రతిపక్ష టీడీపీలో సీనియర్ నేతలు ఘాటుగా స్పందించటం స్టార్ట్ చేశారు. గతానికి భిన్నంగా తమ వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ నేతలు మీడియా సమావేశాలు తగ్గించుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని సీనియర్ నేత, ఎమ్మెల్యే కరణం బలరామ్ వ్యాఖ్యానించారు. షోలు తగ్గించి ఫీల్డ్ లో ఫోకస్ పెట్టాలని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డారు. మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్‌కి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. భయపడే వాడు రాజకీయాల్లో ఉండకుండా ఇంట్లో ఉండటం మంచిదని సూచించారు. రాజధాని అమరావతిపై ప్రధాని మోదీని కలిస్తే మంచిదని, అమరావతిలో పరిణామాలు టీడీపీ నేతలే మోదీకి వివరించాలని అయ్యన్న చెప్పారు. నేతలకు పార్టీ అవసరం ఉంది కానీ..పార్టీకి నేతలు ముఖ్యంకాదన్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ నేత అధినేత చంద్రబాబునాయుడు మాత్రం జగన్ సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లను పరిమితం చేసి జె ట్యాక్స్ రూపంలో కోట్లాది రూపాయలు దక్కించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్ తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ చంద్రబాబు ఈ నెల 17 నుంచి 175 నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్ర చేయటానికి రెడీ అయ్యారు. ఈ మేరకు విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ టూర్ 45 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా. త్వరలోనే ఈ పర్యటనకు సంబంధించి విధివిధానాలు..రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు..

Next Story
Share it