కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నాడు కుప్పకూలాయి. ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి. ఏ దశలోనూ రికవరీ సంకేతాలు కన్పించలేదు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు..కరోనా భయాలే మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని విభాగాల షేర్లు పతనం అయ్యాయి. దీంతో ఒకే రోజు లక్షల కోట్ట రూపాయల సంపద ఆవిరి అయిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ క్లోజింగ్ లో 1448 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీదీ అదే వరస. అత్యధికంగా మెటల్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ప్రారంభం అయిన అయిదే అయిదు నిమిషాల్లో సుమారు రూ. 4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద, మార్కెట్ క్యాప్ రూ. 5 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది.
దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ విలువ రూ.150 లక్షల కోట్లకు పడిపోయింది. మొత్తంగా ఆరు రోజుల వరస నష్టాలతో దలాల్ స్ట్రీట్‌లో రూ.10 లక్షల కోట్లు సంపద హరించుకుపోయినట్లు లెక్కలు కట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని నియంత్రించకపోతే..గణనీయమైన ప్రతికూల ప్రభావం ఉండనుందని గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ సంస్థ జెఫెరీస్ పేర్కొంది. ముఖ‍్యంగా దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లో ఈ వైరస్ విస్తరించడం ప్రమాదాన్ని సూచిస్తోందని పేర్కొంది.