రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం..జగన్
‘విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. విశాఖలో సచివాలయం, హెచ్‌వోడీ, ముఖ్యమంత్రి కార్యాలయాలు ఉండనున్నాయి. ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టే.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశాం. ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. రాష్ట్రంలోని ప్రజలను మభ్య పెట్టాలని, గ్రాఫిక్స్ చూపించాలని నేను అనుకోలేదు. నేను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలు మాత్రమే చెప్పా. జపాన్, సింగపూర్ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిచాం. గత పదేళ్లలో శ్రీశైలానికి చేరే కృష్ణా జలాలు.. 1200 టీఎంసీల నుంచి 600 టీఎంసీలకు పరిమితమయ్యాయి. మొత్తం కృష్ణానది ఆయకట్టుకు నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు గోదావరిలో పుష్కలమైన జలాలున్నాయి. ఏడాదికి 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఒక్క అమరావతిలోనే డబ్బులు ఖర్చు చేయాలా?.. లేకపోతే ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలా అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం నాడు విజయవాడలో హిందూ పత్రిక నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదన్నారు. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు. తన స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని సదస్సుకు హాజరైన వారిని ప్రశ్నించారు.
ఇంగ్లిషు మీడియం అనేది ఇప్పడు కనీస అవసరం. ఇంటర్నెట్, కంప్యూటర్ భాషలన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. ఈ రోజు మనం ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే 20 ఏళ్లలో రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడు. ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం స్కూళ్లకు పంపగలమా?. పేదవాళ్లు మాత్రమే తెలుగు మీడియం స్కూళ్లలో ఎందుకు చదవాలి?. 98.5 శాతం ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువు చెప్తున్నాయి. పేద విద్యార్థులను ఎందుకు బలవంతంగా తెలుగు మీడియం చెప్పే పాఠశాలలకు పంపాలి. ఇంగ్లిష్ మీడియంలో చదవడం ద్వారా విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారు. మేం కేవలం ఇంగ్లిష్ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదు.. విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతాం. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేస్తున్నాం. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని తెలుసు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.