చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటి సోదాలు

కీలక పరిణామం. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యేంత వరకూ చంద్రబాబు వద్ద పీఎస్ గా పని చేశారు. ఫలితాల వెల్లడి అనంతరం కొన్ని రోజులు సెలవు పెట్టి..చంద్రబాబు దగ్గర విధులకు దూరంగా ఉన్నారు. తర్వాత ప్రభుత్వ విధుల్లో చేరిపోయారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. విజయవాడ బెంజ్‌సర్కిల్‌లో సమీపంలో ఉన్న శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటి అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్ రెండు దశాబ్దాలకుపైగా చంద్రబాబు దగ్గరే విధులు నిర్వహించారు. వాస్తవానికి ఏపీలో ఎఫ్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పుడే శ్రీనివాస్ ఇలాంటి పరిణామాలు ఉంటాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు దగ్గర ఉద్యోగం మానేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయినా సరే ఇఫ్పుడు ఐటి అధికారులు రంగంలోకి విచారణ చేయటం కీలక పరిణామంగా మారింది. అయితే శ్రీనివాస్ దగ్గర అధికారుల కీలక సమాచారం లభించే అవకాశం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.



