Telugu Gateway
Latest News

బిల్ గేట్స్ ‘సూపర్ బోటు’ ఖరీదు 4600 కోట్లు

బిల్ గేట్స్ ‘సూపర్ బోటు’ ఖరీదు 4600 కోట్లు
X

బోటులో అతిథులకు అదిరిపోయే సౌకర్యాలు

యోగా స్టూడియో..స్విమ్మింగ్ పూల్ కూడా

బిల్ గేట్స్. ఎంత సంపద ఉన్నా..సింపుల్ ఉండటం ఆయన నైజం. తాజాగా బిల్ గేట్స్ నిర్ణయం ఒకటి వార్తల్లోకి ఎక్కింది. హాలిడేస్ ఎంజాయ్ చేయటం ఆయనకు మహా సరదా. మధ్య తరగతి ప్రజలే ఏడాదికి ఓ సారి అంతర్జాతీయ హాలిడేస్ ప్లాన్ చేసుకునే ఈ రోజుల్లో బిల్ గేట్స్ కు అలాంటి సరదా ఓ లెక్కలోకే రాదు. కాకపోతే ఇప్పుడు బిల్ గేట్స్ అత్యంత విలాసవంతమైన సూపర్ బోట్ కొనుగోలు చేయనున్నారు. అందుకు ఆయన ఏకంగా భారతీయ కరెన్సీలో చూస్తే 4600 కోట్ల రూపాయల వ్యయంతో ఓ సూపర్ బోటు (superYacht) కొనుగోలు చేశారు. రాబోయే రోజుల్లో ఆయన అందులోనే తన హాలిడేస్ ఎంజాయ్ ప్లాన్ చేసుకోనున్నారు. ఈ సూపర్ బోట్ కు ఓ ప్రత్యేకత ఉంది. అది పూర్తిగా లిక్విడ్ హైడ్రోజన్ ఆధారితంగా నడుస్తుంది. అంటే దీని నుంచే వ్యర్ధాలు కేవలం నీరు మాత్రమే ఉంటుంది. పర్యావరణహితమైన బోట్ కావటంతో బిల్ గేట్స్ దీనివైపు మొగ్గుచూపారు.

ఈ మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సంపన్నుడు అయిన బిల్ గేట్స్ 4600 కోట్ల రూపాయల వ్యయంతో ఓ సూపర్ బోట్ కొనుగోలు చేయటం పెద్ద వింతేమీ కాదు. కాకపోతే ఈ తరహా అంటే పూర్తిగా లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే తొలి సూపర్ బోటు ఇదేనని చెబుతున్నారు. ఈ సూపర్ బోట్ లో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. ఐదు డెక్స్ తో కూడిన ఈ బోట్ లో జిమ్, యోగా స్టూడియో, బ్యూటీ రూమ్, మసాజ్ పార్లర్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు ఉంటాయని ‘డైలీ మెయిల్’ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ సూపర్ బోట్ అందుబాటులోకి రావటానికి కొన్ని సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన మోనాకో షో లో ఈ డిజైన్ చూసిన తర్వాతే బిల్ గేట్స్ దీని కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు ఈ కథనం వెల్లడించింది.

Next Story
Share it