వైసీపీ ఎమ్మెల్యేలు నేరస్థుల ముఠా
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా ఓ నేరస్థుల ముఠా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 86మంది వైసీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని, నేరస్థుల ముఠాను మేధావులతో పోల్చుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేవలం మూడు రాజధానుల అంశాన్ని సెలక్ట్ కమిటీ పంపారనే కోపంతోనే మండలి రద్దుకు తీర్మానం ప్రవేశపెట్టారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చర్యను ఖండిస్తున్నామని..మండలి రద్దు విచారకరమన్నారు. చివరకు ఓటింగ్ విషయంలోనూ నాటకాలు ఆడారని మండిపడ్డారు. ముందు మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా 121 ఓట్లు వచ్చాయని ప్రకటించి..తర్వాత 133 ఓట్లు అని ఎలా ప్రకటిస్తారన్నారు. చంద్రబాబు సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధానిపై ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను పున:సమీక్షించాలని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో 3 రాజధానుల అంశాన్ని మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపారని తెలిపారు. ఉన్నత ఆశయాలతో ఏర్పడిన మండలిని రద్దు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో...రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారని చంద్రబాబు పేర్కొన్నారు.
మండలిని రద్దు చేసే అధికారం అసెంబ్లీకి లేదని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీకి తీర్మానం చేసే అధికారం మాత్రమే ఉందని అన్నారు.. మండలికి జగన్ ప్రభుత్వం రాజకీయాలు ఆపాదించిందని, మండలిలో టీడీపీ చేసిన తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు. మండలికి ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుస్తున్నామన్న జగన్... కోర్టులకు వెళ్లేందుకు రూ.30కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 22 మంది మంత్రులు, ఏ2 సహా అందరూ మండలిలోనే ఉండి చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని చంద్రబాబు విమర్శించారు. ఎమ్మెల్సీలను, చైర్మన్ షరీఫ్‌ను బెదిరించారు, దూషించారని, ఏ రూల్ ప్రకారం మండలి అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడారని చంద్రబాబు అన్నారు. చిత్తశుద్ధి ఉంటే గురువారమే మండలి రద్దు తీర్మానం ఎందుకు పెట్టలేదని, ఎమ్మెల్సీలతో బేరసారాలు సాగించాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగకపోవడంతో మండలి రద్దు తీర్మానం చేశారని, రూ.5 కోట్లే కాదు... ఇంకా ఎక్కువే ఆఫర్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. మా ఎమ్మెల్సీలంతా నిజాయితీపరులు, మీకే విశ్వసనీయతలేదని, తన విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని అన్నారు.