Telugu Gateway
Latest News

దేవుళ్లకూ రాజకీయ సెగ..‘షిర్డి’లో సర్కారు నిర్ణయం కలకలం

దేవుళ్లకూ రాజకీయ సెగ..‘షిర్డి’లో సర్కారు నిర్ణయం  కలకలం
X

దేవుళ్లకూ రాజకీయాల తిప్పలు తప్పటం లేదు. తాజాగా మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం షిర్డిలో పెద్ద దుమారమే రేపుతోంది. షిర్డి గ్రామస్తులు ఆదివారం నాటి నుంచే దేవాలయాన్ని మూసివేస్తామని ప్రకటించటం కలకలం రేపుతోంది. అయితే షిర్డి సంస్థాన్ ట్రస్ట్ మాత్రం మూసివేత వార్తలను తోసిపుచ్చింది. గ్రామస్తులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని..భక్తులు ఎవరూ ఆందోళన చెందొద్దని షిర్డి ట్రస్ట్ చెబుతోంది. అలయాన్ని మూసివేయటం అంటే లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని ట్రస్ట్ చెబుతోంది. అసలు ఈ వివాదానికి కారణం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే తీసుకున్న నిర్ణయమే. షిర్డీ సాయి జన్మ స్థలమని కొంత మంది భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన ప్రకటన దీనికి కారణమైంది. ఈ ప్రకటనపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శివసేన–ఎన్సీపీ– కాంగ్రెస్‌ ప్రభుత్వం సాయి బాబా జన్మస్థలాన్ని వివాదాల్లోకి లాగుతోందని బిజెపి ఆరోపించింది.

షిర్డీ సాయి జన్మ స్థలం విషయమై రాజకీయ జోక్యం ఇలాగే కొనసాగితే షిర్డీ ప్రజలు న్యాయపోరాటానికి దిగుతారని అహ్మద్‌నగర్‌ ఎంపీ సుజయ్‌ విఖే పాటిల్‌ హెచ్చరించారు. ఇక పత్రీని సాయిబాబా స్వస్థలంగా అభివృద్ధి చేస్తామన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటనకు నిరసనగా షీర్డీ గ్రామస్తులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తో ట్రస్ట్‌ కు సంబంధం లేదని తెలిపింది. భక్తులు ఆందోళనకు గురికావద్దని షిర్డీ ఆలయం, భక్తి నివాస్‌లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ పీఆర్‌వో మెహన్‌ యాదవ్‌ చెప్పారు. షిర్డి చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాల సర్పంచ్ లు షిర్డి గ్రామస్తులు తీసుకునే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సాయిబాబా జన్మస్థలం షిర్డినే అని కొంత మంది...పత్రి అని కొంత మంది వాదిస్తున్నారు. దీనిపైనే ఇప్పుడు వివాదం రాజుకుంది.

Next Story
Share it