Telugu Gateway
Latest News

నిర్భయ దోషుల ఉరి మళ్ళీ వాయిదా

నిర్భయ దోషుల ఉరి మళ్ళీ వాయిదా
X

అంతా అయిపోయింది అనుకున్నారు. శనివారం ఉదయం ఉరి అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ మేరకు తీహార్ జైలులో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ సడన్ గా శుక్రవారం సాయంత్రం మళ్ళీ బేక్ర్. నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు ఉరిశిక్షపై ఢిల్లీ లోని పాటియాలా హౌజ్‌ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దోషుల మరణ శిక్షను నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీహార్‌ జైలు అధికారులకు నోటీసులు పంపింది. ఇక ఇదే కేసులో దోషి అక్షయ్‌ వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో మరో దోషి అయిన పవన్‌ గుప్తా రేప్ ఘటన జరిగే నాటికి తాను మైనర్‌ అంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసింది. ఏడేళ్ల క్రితం ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై ఆరుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హింసించగా.. సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించిన విషయం విదితమే. ఈ కేసులో ప్రధాన దోషి రామ్‌ సింగ్‌ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన నాటికి మైనర్‌గా ఉన్న మరో నిందితుడు విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులు ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31)లకు దాదాపు రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది.

ఈ క్రమంలో జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ... వినయ్‌ శర్మ, ముఖేష్‌ కుమార్‌ సర్వోన్నత న్యాయస్థానంలో క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేయడం.. ముఖేష్‌ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన నేపథ్యంలో.. నిబంధనలను అనుసరించి ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో పటియాలా హౌజ్‌ కోర్టు ఆదేశాలతో మరోమారు ఉరిశిక్ష వాయిదా పడింది. మళ్ళీ ఇది ఎప్పుడు ఉంటుందో వేచిచూడాల్సిందే. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుపై ఆమె కంటతడి పెట్టారు. దోషులకు ఎప్పటికీ ఉరిశిక్ష పడదంటూ వారి తరపు లాయర్ ఏ పీ సింగ్ సవాల్ విసిరాడని ఆమె వ్యాఖ్యానించారు. దోషులకు శిక్ష పడే వరకూ తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Next Story
Share it