Telugu Gateway
Latest News

భారత్ లో తొలి కరోనా కేసు నమోదు

భారత్ లో తొలి కరోనా కేసు నమోదు
X

కరోనా...కరోనా. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ. చైనాను హడలెత్తిస్తున్న ఈ వైరస్ పలు దేశాలకు విస్తరిస్తోంది.. భారత్ లో కూడా తొలి కరోనా కేసు నమోదు అయింది. చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్ధికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెను ఓ ప్రత్యేక గదిలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నిర్ధారించింది. అయితే ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆ విద్యార్థి చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతున్నారు. మరోవైపు చైనాలో చదువుకుంటున్న 23వేలకు పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సన్నాహాలు చేస్తోంది.

చైనా నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించటానికి విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా థర్మల్‌ స్కానింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. వారి వివరాలు నమోదు చేసుకుని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి బారినపడి చైనాలో 170 మంది మృతిచెందారు. ఈ సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ కూడా దీనిపై స్పందించారు. ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉందని..ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సమస్యను ఎదుర్కొనే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Next Story
Share it