Telugu Gateway
Latest News

వధువులుగా చైనాకు పాక్ అమ్మాయిల అమ్మకం!

వధువులుగా చైనాకు పాక్ అమ్మాయిల అమ్మకం!
X

పాకిస్థాన్ కు చెందిన వందలాది యువతులను అక్రమంగా చైనాకు అమ్మేస్తున్న విషయం వెలుగు చూసింది. వధువులుగా వీరందరిని చైనాకు తరలిస్తున్నారు. చైనాకు చెందిన వ్యక్తులే పెళ్ళిళ్లు చేసుకున్నట్లు రికార్డుల్లో చూపించి వారిని చైనాకు తీసుకెళుతున్నారు. పాకిస్థాన్ లోని పేద, అంతగా శక్తిలేని వర్గాలకు చెందిన పిల్లలే టార్గెట్ గా మనుషులను అక్రమ రవాణా చేసే వారు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇలా పాక్ నుంచి చైనాకు అక్రమంగా తరలించిన వారి సంఖ్య దాదాపు ఎనిమిది వందల వరకూ ఉంటుందని ఓ అంచనా. పాకిస్థాన్ కు చెందిన అధికారుల పరిశీలనలోనే ఈ విషయాలు వెలుగు చూశాయి. అయినా చైనాతో పాకిస్తాన్ కు ఉన్న సంబంధాల దృష్టా కేసు ముందుకెళ్లకుండా ప్రభుత్వమే ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. చైనాకు చెందిన 31 మంది అక్రమ రవాణాదారులను ఫైసలాబాద్ కోర్టు కొద్ది రోజుల క్రితం కేసు నుంచి నిర్దోషులుగా ప్రకటించింది.

బాధిత మహిళలకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చి లేదా బెదిరించి నోరెత్తకుండా చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ సంచలన విషయాలను ‘గల్ఫ్ న్యూస్. కామ్’ వెల్లడించింది. బాధిత మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా ఎవరూ ఏమీ చేయటంలేదని, దీంతో పాక్ నుంచి చైనాకు అమ్మాయిలను తరలించే రాకెట్ యధేచ్చగా సాగటంతోపాటు ఇది మరింత పెరుగుతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వెల్లడించారు. చైనా విదేశాంగ శాఖ మాత్రం తమకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. అయితే అటు చైనా, ఇటు పాకిస్థాన్ ప్రభుత్వాలు మాత్రం పరస్పర అంగీకారంతో ఏర్పడే హ్యాపీ ఫ్యామిలీలకు తాము ఎలాంటి అడ్డంకి చెప్పబోమని అంటున్నాయి. కొంత మంది బ్రోకర్లకు పాకిస్తాన్ లోని క్రిస్ట్రియన్ మైనారిటీ వర్గాలను తమ కొత్త టార్గెట్ గా చేసుకున్నాయని పేర్కొన్నారు.

పేద కుటుంబాలకు చెందిన పిల్లలను పెళ్ళి చేసుకుని, అందులో ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలను చైనా పెళ్లికొడుకులు తమ దేశంలోనే వాళ్లను వదిలేస్తున్నారు. కొంత మందిని అయితే బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. క్రిస్టియన్ మైనారిటీలను టార్గెట్ చేయటం వెనక కూడా ఆర్ధిక కోణం ఉందని చెబుతున్నారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉండే ఆ దేశంలో క్రిస్టియన్లు అత్యంత పేదలుగా ఉంటారని తెలిపారు. ఈ వ్యాపారం ద్వారా భారీ మొత్తంలో ఆర్జిస్తూ అమ్మాయిల కుటుంబాలకు మాత్రం నామమాత్రపు చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించారు ఈ సెప్టెంబర్ లోనే చైనా వ్యక్తులు చేసుకునే దొంగ పెళ్లిళ్ళకు సంబంధించిన నివేదికను అదికారులు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అందజేశారు.

Next Story
Share it