బుర్జ్ ఖలీఫా’లో మూడు ఫ్లోర్ల ఖరీదు 7000 కోట్లు!
బుర్జ్ ఖలీఫా. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం ఇదే. దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా భవనాన్ని ఆ దేశానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ సందర్శిస్తారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. దుబాయ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇది ఎంతో ముఖ్యమైనదే. బుర్జ్ ఖలీఫా సందర్శించకుండా ఎవరికీ దుబాయ్ పర్యటన పూర్తి అయినట్లు కాదు. ఈ బుర్జ్ ఖలీఫా భవన నిర్మాణ సంస్థ అయిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఈ భవనంలోని అత్యంత కీలకమైన మూడు ఫ్లోర్లు అమ్మకానికి పెట్టింది. అది కూడా ఎంతకో తెలుసా?. భారతీయ కరెన్సీలో ఏకంగా ఇది ఏడు వేలకోట్ల రూపాయల పైమాటే. ప్రపంచంలోని అతి ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాలో పర్యాటకులు అందరూ దుబాయ్ నగర అందాలను వీక్షించాలంటే ‘ఎట్ ద టాప్’ అబ్జర్వేషన్ డెక్ కు వెళ్లాల్సిందే.
ఇది బుర్జ్ ఖలీఫాలోని 124,125తోపాటు 148 ఫ్లోర్లలో ఉంటాయి. అయితే ఈ ఫ్లోర్లలోకి ప్రవేశించి దుబాయ్ అందాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిందే. ప్రతి ఏటా కోట్లాది మంది బుర్జ్ ఖలీఫాలోని ఈ ఎట్ ద టాప్ కు చేరుకుని దుబాయ్ అందాలను వీక్షిస్తారు. అందులో ప్రత్యేకంగా రాత్రి వేళల్లో దుబాయ్ అందాలను అక్కడ నుంచి వీక్షించేందుకు పోటీలు పడతారు. ఈ మూడు ఫ్లోర్స్ ను ఒక బిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్మేందుకు ఎమ్మార్ ప్రాపర్టీస్ రెడీ అయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి.