జియో కాల్ ఛార్జీలు పెరుగుతున్నాయ్
రిలయన్స్ జియో కూడా అదే బాట పట్టింది. ఇఫ్పటికే ఎయిర్ టెల్, ఐడియాలు డిసెంబర్ 1 నుంచి ఛార్జీలు పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెంపు ఎంత ఉంటుందనే అంశంపై మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు రిలయన్స్ జియో కూడా తాము కూడా రేట్లు పెంచుతున్నామని ప్రకటించింది. దీంతో దేశంలోని అగ్రశ్రేణి టెలికం కంపెనీలు అన్నీ టారిఫ్ లు పెంపునకు సిద్ధం అయినట్లు అయింది. ఇక్కడ ఓ విశేషం ఏమిటంటే వోడాఫోన్, ఎయిర్ టెల్ లు భారీ ఎత్తున బకాయిలు చెల్లించాల్సి ఉండటంతోపాటు రకరకాల కారణాలతో రేట్లు పెంచటానికి సిద్ధపడగా..ఇదేమీ లేకుండానే జియో మాత్రం తన వినియోగదారులపై భారం మోపటానికి రెడీ అయింది.
తొలుత ‘ఉచిత’ ఆఫర్లతో అదరగొట్టి దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులను సంపాదించుకున్న జియో ఇప్పుడు తాము కూడా అందరితోపాటు అన్నట్లే వ్యవహరిస్తోంది. జియో ఇప్పటికే నాన్-జియో కాల్స్ కు నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేస్తోంది. ఇప్పుడు మొబైల్ చార్జీలు కూడా పెంచితే ఖాతాదారులపై మరింత భారం పడనుంది. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు, పరిశ్రమను బలోపేతం చేసేందుకు ట్రాయ్ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. డేటా వినియోగం, డిజిటలైజేషన్‌కు ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా మరికొన్ని వారాల్లో తాము కూడా టారిఫ్‌ను పెంచుతామని ముఖేశ్ అంబానీ సంస్థ వెల్లడించింది.