పీఎస్ఎల్వీ- సీ 47 సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు మరో ఘన విజయం. చంద్రయాన్ ప్రయోగం చివరి నిమిషంలో ఫెయిల్ అయినా..ఆ ప్రభావం ఏ మాత్రం పడకుండా ఇస్రో అద్భుతాలు ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతోంది. అందులో భాగమే బుధవారం నాడు చేపట్టిన పీఎస్ఎల్ వీ సీ-47 ప్రయోగం. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి పీఎస్ఎల్వీ- సీ 47 వాహక నౌక దూసుకెళ్లింది. 14 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ- సీ 47 వాహకనౌక ప్రయోగం జరిగింది. నిర్దేశిత సమయంలో..నిర్దేశిత కక్ష్యలోకి ఈ ఉపగ్రహలను పంపారు. కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ- సీ 47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. కార్టోశాట్-3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్వర్క్ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టోశాట్-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టోశాట్-3 జీవితకాలం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది. పీఎస్ఎల్వీ- సీ 47 విజయం అనంతరం ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. ప్రయోగంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వచ్చే మార్చి లోగా మరో 6 రాకెట్లతో 13 మిషన్లు ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ ప్రయోగాలకు మరింత స్పూర్తినిస్తుందని ఇస్రో చైర్మన్ డా. శివన్ తెలిపారు. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్ 3 మరింత స్పష్టంగా కనిపెట్టి భారత రక్షణ రంగానికి విశేష సేవలు అందించనుంది. పీఎస్ఎల్వీ- సీ 47 లాంచింగ్ ప్రక్రియ అంతా 26 గంటల పాటు సాగింది.