Telugu Gateway
Latest News

మోడీ సర్కారుకు ‘జీడీపీ షాక్’

మోడీ సర్కారుకు ‘జీడీపీ షాక్’
X

ఆరేళ్ళ కనిష్టానికి దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రేటు పడిపోవటం కలకలం రేపుతోంది. ఇది కేంద్రంలోని మోడీ సర్కారుకు షాక్ లాంటిదే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు గత కొంత కాలంగా కేంద్రం దేశంలోని పలు రంగాల్లో డిమాండ్ పెంచేందుకు ప్యాకేజీలు ప్రకటించింది. అయితే వీటి ఫలితాలు రావటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నా ఇఫ్పుడు 2019 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. ఇది ఆరేళ్ళ కనిష్టం. గత సంవత్సరం ఇదే కాలంలో జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంది. తయారీ రంగంలో మందగమనం, వినియోగదారుల డిమాండ్ తగ్గటం, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు జీడీపీ వృద్ధి రేటు తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు.

ఇదే ఏడాది అంటే 2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో అంటే 5 శాతంగా రికార్డు అయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (2019 ఏప్రిల్-సెప్టెంబర్) కాలంలో ఆర్ధిక వృద్ధి రేటు 4.8 శాతానికి పరిమితం అయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 7.5 శాతం ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ దేశ ఆర్థిక వృద్ధిలో మందగమనం ఉంది కానీ మాంద్య పరిస్థితులు లేవని,పురోగతికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రెండు రోజుల క్రితం ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీడీ ఆరున్నర సంవత్సరాల కనిష్టాన్ని నమోదు చేయటం గమనార్హం.

Next Story
Share it