భారత్ చేతికి రాఫెల్ విమానం వచ్చేసింది

రాఫెల్ విమానాలు ఇక రఫ్ ఆడించటమే మిగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి రాఫెల్ విమానం భారత్ చేతికి అందింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ లో అధికారికంగా ఈ విమానాన్ని స్వీకరించారు. ఈ విమానాలకు సంబంధించి ధర వ్యవహారం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ విమానాల రేటు విషయంలో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇది ఓ ప్రధాన ఏజెండాగా మారిన సంగతి తెలిసిందే. అయితే దేశ ప్రజలు ఎవరూ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదనే విషయాన్ని ఫలితాలు తేల్చాయి. రాఫెల్ విమానాల రాకతో భారత్ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన సాధనా సంపత్తి వచ్చి చేరినట్లు అయింది. భారత్ లో దసరా పర్వదినంతో పాటు 87వ ఎయిర్‌ఫోర్స్ డే జరుపుకుంటున్న క్రమంలో తొలి రఫేల్ విమానాన్ని అందుకోవడం సంతోషదాయకమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అనుకున్న సమయానికి రాఫేల్ ఎయిర్‌క్రాఫ్ట్ డెలివరీ జరగడం స్వాగతించదగిన పరిణామమని రాఫేల్ రాకతో తమ వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్, ఫ్రాన్స్ లను ఉద్దేశిస్తూ రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల నడుమ రానున్న రోజుల్లో పలు రంగాల్లో పరస్పర సహకారం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు.రాఫేల్ జెట్ సరఫరాకు శ్రీకారం చుట్టడం ద్వారా నేడు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య పరంపరలో నూతన మైలురాయి వంటిదని వ్యాఖ్యానించారు. రాఫేల్ సామర్థ్యం మేర రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వాయుసేనలో భారత్ బలోపేతమై ఈ ప్రాంతంలో శాంతిభద్రతల బలోపేతానికి మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. భారత్ కు మొత్తం 36 విమానాలు అందాల్సి ఉంది. తొలి విమానం దసరా రోజు అందుకుని..దానికి ఆయుధ పూజ నిర్వహించారు. విమానం అందుకున్న తర్వాత రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ లో ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రెన్ తో సమావేశం అయ్యారు.