Telugu Gateway
Latest News

కాసుకోండి..గోల్డ్ షాక్ ఇవ్వనున్న మోడీ సర్కారు

కాసుకోండి..గోల్డ్ షాక్ ఇవ్వనున్న మోడీ సర్కారు
X

బంగారంపై భారత్ ఏటా చేస్తున్న వ్యయం 2.5 లక్షల కోట్లు

పెద్ద నోట్ల రద్దు. జీఎస్టీ వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న కేంద్రం మరో కీలక నిర్ణయం దిశగా అడుగేస్తుందా? అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. దేశంలో ప్రజలు ఇబ్బడిముబ్బడిగా బంగారం కొంటున్నా దాని వల్ల ఆర్ధిక వ్యవస్ధకు పెద్దగా ఉపయోగం లేకుండా పోతుందని..అందుకే ఈ విధానంలో మార్పులు చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ ఏటా బంగారంపై చేసే వ్యయం ఎంతో తెలుసా?. అక్షారాలా 2,50,000 కోట్ల రూపాయలు. దేశంలోని మహిళలకు బంగారం అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత్ ప్రతి ఏడాది దాదాపు 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇలా బంగారంపై ఏటా చేసే వ్యయం 2.5 లక్షల కోట్ల రూపాయలు ఏమైనా ఉత్పాదక వ్యయమా అంటే అదీ కాదు. బంగారం కొంటారు..తీసుకెళ్లి సేఫ్ డిపాజిట్ బాక్స్ ల్లో దాచుకుంటారు. ఇది అనుత్పాదక వ్యయంగా మారిపోతుందని..పైగా దీని వల్ల దేశ విదేశీ మారక నిల్వలు వృధా అయిపోతున్నాయనే ఉద్దేశంతో కేంద్రం కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చేయోచన చేస్తోంది.

ఈ దిశగా ప్రస్తుతం వడివడిగా అడుగులు పడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ సర్కారు ఓ సారి నల్లధనం వెలికితీసేందుకు స్వచ్చంద వెల్లడి పథకం(వీడీఎస్) ప్రవేశపెట్టింది. ఎంత బ్లాక్ మనీ ఉన్నా ఈ పథకం కింద వెల్లడిస్తే నామమాత్రపు పన్నుతో అంతా అధికారికంగా చేశారు. ఇప్పుడు అదే తరహాలో బంగారానికి కూడా ఓ స్కీమ్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అదే సమయంలో తర్వాత భారీ ఎత్తున పన్నులు పెంచి దిగుమతులను కూడా నియంత్రించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం ప్రకటించనున్న పథకం ప్రకారం దేశంలోని అందరూ ఒకసారి తమ దగ్గర బంగారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి బంగారం ఉన్న వారిపై భారీ జరినామాలు విధించనున్నారు. అయితే పెళ్ళైన మహిళల వద్ద బంగారం విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దేశంలో కొత్తగా గోల్డ్ బోర్డ్ ఏర్పాటు విషయంలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ఆర్ధిక వ్యవహారాల శాఖతోపాటు రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ ప్రతిపాదనను రెడీ చేస్తున్నాయి. వాస్తవానికి కేంద్ర నూతన పథకం ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నా మహారాష్ట్ర, హర్యాల ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్లు చెబుతున్నారు.

Next Story
Share it