Telugu Gateway
Andhra Pradesh

రాయలసీమను అవమానిస్తున్న చంద్రబాబు

రాయలసీమను అవమానిస్తున్న చంద్రబాబు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఎప్పుడూ నదులు ఎండిపోయి.. ఇసుక తిన్నెలు తేలి కనిపించాలని వ్యాఖ్యానించారు. అలా తేలిన ఇసుకను దోచుకునే పదివేల మంది కోటీశ్వరులు అయ్యారని ఆరోపించారు. జలశయాలు నిండితే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని అంటూ మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. చంద్రబాబు మెదడులో ఉండే చిప్‌ డిస్‌లొకేట్‌ అయినట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

కేసులకు భయపడి టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన చంద్రబాబు.. పులివెందుల పంచాయితీలు, రాయలసీమ గుండాలు అంటూ రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు రాయలసీమ మహిళలు వాతలు పెట్టె రోజులు దగ్గరలోనే ఉన్నాయని చురకలు అంటించారు. ‘చంద్రబాబు కుమారుడు లోకేష్ ఒక మాలోకం. సిగ్నేచర్ లేని, ఔట్‌డేటెడ్‌ చెక్ లాంటి వాడు. లోకేష్‌కు... సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తన కుమారుడిని తలుచుకుంటూ బాధతో చంద్రబాబు సీఎం జగన్‌పై పడి ఏడుస్తున్నారు. ఇక వందల కోట్లు ప్రజధనాన్ని తినేసి కొవ్వు పట్టిన దేవినేని ఉమా కూడా సీఎం గురించి మాట్లాడుతున్నారు. రివర్స్ టెండరింగ్‌లో ఆదా అయిన రూ. వెయ్యి కోట్ల ప్రజాధనం ఉమాకు కనిపించడం లేదా’ అని శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ‘సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే ఎల్లో మీడియా దానిని కూడా వక్రీకరిస్తుందని అన్నారు.

Next Story
Share it