ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం

ప్రపంచంలోని అతి భయంకరమైన ఉగ్రవాద సంస్థల్లో ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఒకటి. ఎంతో మంది అమాయకులను దారుణంగా..అతి భయంకరంగా హత్యలు చేసిన చరిత్ర ఐసిస్ ది. ఐసిస్ పేరు చెపితేనే హడలిపోయే పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏకంగా ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిని అమెరికా దళాలు మట్టుబెట్టాయి. నేరుగా కాకపోయినా అమెరికా దళాల దాడితో మరో మార్గం లేక బాగ్దాదీని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించారు. దీంతో ఐసిస్ బారిన పడిన దేశాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే బాగ్దాదీ మృతితోనే అంతా అయిపోయిందని అనుకోవటానికి వీల్లేదని.ఐసిస్ మూలాలను సమూలంగా తుడిచేసేందుకు కృషి చేయాల్సి ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది. ఏది ఏమైనా బాగ్దాదీ మృతి మాత్రం ఆమెరికాతోపాటు ఎన్నో దేశాలకు పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పొచ్చు. బాగ్దాదీ మృతిపై ట్రంప్ ఓ ప్రకటన చేశారు. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది చనిపోయిన మాట నిజమేనని తెలిపారు. అయితే అతన్ని తమ బలగాలు మట్టుబెట్టలేదని చెప్పారు. ‘ఐసిస్ స్థావరాలపై మా భద్రతా బలగాలు దాడులు చేస్తున్న సమయంలో బాగ్దాది భయపడిపోయాడు. ఒక పిరికివాడిలా తనకు తాను ఆత్మాహుతి దాడి చేసుకుని చనిపోయాడు’అని ట్రంప్ వెల్లడించారు.
ఈ దాడిలో బాగ్దాదితో పాటు మరో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించాడు. ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ వేలమంది ప్రాణాలను తీసింది. కానీ, దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడని ట్రంప్ పేర్కొన్నారు. సిరియాలో మారణహోమం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్-అల్- బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అతడి ప్రధాన అనుచరుడు ఇచ్చిన సమాచారమే తోడ్పడిందని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు. అయితే మరికొన్ని వాదనలు కూడా విన్పిస్తున్నాయి బాగ్దాదీ భార్యల్లో ఒకరు ఆయన ఉనికి తెలియజేశారనే వాదన కూడా ఉంది. అబు బాకర్ను అంతమొందించడంలో తమకు సహకరించిన సిరియా కుర్దిష్ వర్గాలు, రష్యా, టర్కీ తదితర మిత్రదేశాలకు ధన్యవాదాలు తెలిపారు ట్రంప్.
అబు బాకర్ జాడ కోసం అన్వేషిస్తున్న క్రమంలో అతడి ప్రధాన అనుచరుడు ఇతావీ 2018 ఫిబ్రవరిలో టర్కిష్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని ఇరాక్ సేనలకు అప్పగించారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా... ‘ఐదు ఖండాలలో తన ఉన్మాదంతో విధ్వంసం సృష్టించిన అబు బాకర్ ఎల్లప్పుడూ మినీ బస్సుల్లోనే తన సహచరులతో సమావేశమయ్యాడు. కూరగాయలతో నిండిన ఆ బస్సుల్లో వారంతా దొంగచాటుగా గమ్యస్థానాలకు చేరుకునేవారు. ఇస్లామిక్ సైన్సెస్లో పీహెచ్డీ చేసిన ఇతావీ అబు బాకర్ ఐదుగురు ముఖ్య అనుచరుల్లో ఒకడు. అతడు 2006లో ఉగ్ర సంస్థ ఆల్ ఖైదాలో చేరాడు. 2008లో అమెరికా సేనలకు పట్టుబడటంతో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో ఇతావీ గురించి తెలుసుకున్న అబు బాకర్ తమతో చేతులు కలపాల్సిందిగా అతడిని కోరాడు.