Telugu Gateway
Latest News

జియో ఫైబర్ వచ్చేసింది...దివాళా ఎవరు?

జియో ఫైబర్ వచ్చేసింది...దివాళా ఎవరు?
X

రిలయన్స్ జియో టెలికం సర్వీసెస్ ఎంట్రీ. అగ్రశ్రేణి టెలికం కంపెనీలు సైతం అల్లాడిపోయాయి. అప్పటివరకూ మార్కెట్ లీడర్లుగా ఉన్నవారు సైతం బేర్ మన్నారు. బ్యాంకులు కూడా జియో దెబ్బకు వణికిపోయాయి. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న టెలికం కంపెనీలు జియో దెబ్బకు విలవిలలాడుతుంటే..అంతే స్థాయిలో బ్యాంకులు కూడా నిరర్ధక ఆస్తులు పెరుగుతాయని బాబోయ్ బాబోయ్ అంటూ మొత్తుకున్నాయి. ఎందుకంటే దేశీయ టెలికం కంపెనీలను జియో కొట్టిన దెబ్బ అలాంటిది మరి. ఒక కంపెనీ హఠాత్తుగా తెరపైకి వచ్చి మిగిలిన కంపెనీలను అలా వణికించటం వెనక మతలబు ఏమిటి?. అంటే అప్పటివరకూ ఇతర టెలికం కంపెనీలు అవకాశం ఉన్నా కూడా వినియోగదారుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేశాయా?. అంటే ఔననే అనుకోవాలి. మరి జియో గుత్తాదిపత్యం వచ్చాక పరిస్థితి ఏంటి?. అంతా తన చేతిలోకి వచ్చాక రేట్లు పెంచేస్తే వినియోగదారుల దారెటు?.

అప్పటికే మిగిలిన కంపెనీలు వేల కోట్ల రూపాయల నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తుంది. మరి మిగిలిన కంపెనీలు వేటికీ సాధ్యం కానిది ఒక్క జియోకు మాత్రమే ఎలా సాధ్యం అవుతుంది?. ఇందులో మతలబు ఎక్కడ ఉంది?. మార్కెట్ విశ్లేషకులు ఎందుకు ఈ అంశాన్ని చేధించలేకపోతున్నారు. అవకాశం ఉంటే ఇతర కంపెనీలు కూడా ఇదే స్థాయిలో ఆఫర్లు ఇవ్వొచ్చు కదా?. ఒక్క రిలయన్స్ కు మాత్రమే దేశ ప్రజలపై అంత ప్రేమ ఉందా?. మిగిలిన వారిది కేవలం వ్యాపార ధోరణి మాత్రమేనా?. అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. కానీ మార్కెట్లో ఎందుకు ఇలా జరుగుతుంది. రిలయన్స్ కంపెనీ మాత్రమే ఇలా ఎందుకు చేయగలుగుతుంది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోనుంది. జియో ఫైబర్ సేవలు ఈ గురువారం నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ దెబ్బకు మరో దఫా పలు కంపెనీలు విలవిలలాడాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. కొద్ది నెలల్లోనే ఈ ఫలితాలు కన్పించబోతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే గురువారం నాడు పలు ఆకర్షణీయ ప్రణాళికలతో జియో ఫైబర్ ముందుకొచ్చింది. జియో ఫైబర్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం కేటగిరీల పేరుతో ప్లాన్లను ప్రకటించింది. ఇందులో కనీస ప్లాన్ ఖరీదు 699 రూపాయలు అయితే గరిష్ట మొత్తం 8499. ఇది నెలకు మాత్రమే. కనీస ప్లాన్ 699 రూపాయలతో 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ ప్లస్ 50 జీబీ అదనపు డేటాను అందించనుంది. ఇందులో ఉచిత వాయిస్ కాలింగ్, టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

సెకండ్ ప్లాన్ ధర 849 రూపాయలుగా నిర్ణయించారు. దీని వేగం కూడా 100 ఎంబీపీఎస్ అయినా దీని కింద డేటాను మాత్రం 200 ప్లస్ 200 జీబీని అందించనున్నారు. 1299 ప్లాన్ కింద 250ఎంబీపీఎస్ వేగంతో డాటా పొందొచ్చు అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీని కింద 500 ప్లస్ 250 జీబీ డేటా అందిస్తారు. వినియోగదారులు 500ఎంబీపీఎస్ వేగం కోరుకుంటే ఈ ప్లాన్ కోసం 2499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో డేటాను 1250 ప్లస్ 250 జీబీ అందిస్తున్నారు. భారతదేశంలోని 1,600 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ - జియో ఫైబర్ - దాని "ఫైబర్ టు ది హోమ్" సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. జియో ఫైబర్‌తో తన వాగ్దానాన్ని కొనసాగిస్తోందని తెలిపింది. ప్రపంచ రేట్ల కంటే పదోవంతు కంటే తక్కువ ధరలకు ధర నిర్ణయించింది, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి, ప్రతి బడ్జెట్‌కు, ప్రతి అవసరానికి అనుగుణంగా ప్లాన్లను సిద్ధం చేశామని తెలిపింది. జియో ఫైబర్‌ వెల్‌కమింగ్‌ ఆఫర్‌. ప్రతీ వినియోగదారుడికి అమూల్యమైన సేవలు

వార్షిక ప్లాన్‌ - ప్రయోజనాలు

జియో హోమ్ గేట్‌వే

జియో 4కే సెట్ టాప్ బాక్స్

టెలివిజన్ సెట్ (గోల్డ్‌ ప్లాన్‌ ఆ పైన మాత్రమే)

మీకు ఇష్టమైన ఓటీటీ అనువర్తనాలకు చందా

అపరిమిత వాయిస్ , డేటా సేవలు ఉచితంగా పొందవచ్చు.

Next Story
Share it