Telugu Gateway
Latest News

శివన్ కంటతడి..మోడీ ఓదార్పు

శివన్ కంటతడి..మోడీ ఓదార్పు
X

ఈ సన్నివేశం చూసిన వారు హృదయాలు కొద్దిసేపు భారంగా మారతాయి. ఎందుకంటే ఇస్రో శాస్త్రవేత్తల అకుంఠిత కృషితో చివరి నిమిషం వరకూ విజయాలను అందుకుంటూ సాగిన చంద్రయాన్2 ప్రయోగం చివరి నిమిషంలో సాంకేతిక సమస్యతో చిక్కుల్లో పడింది. దీంతో దేశ ప్రజలంతా ఒక్కసారిగా ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. ఇందుకు ఇస్రో డైరక్టర్ డాక్టర్ కె శివన్ కూడా మినహాయింపు ఏమీకాదు. ప్రజల కంటే ఆయనకే ఎక్కువ బాధ తెలుసు. ఎందుకంటే ఆయన నాయకత్వంలోనే ఇది అంతా సాగింది కనుక. విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయాయనే సంకేతాలు వచ్చాయి. శివన్ ముఖకవళికల్లో కూడా మార్పులు వచ్చాయి. అంతే కాదు. ప్రధాని నరేంద్రమోడీకి వీడ్కోలు పలికే సమయంలో శివన్ ఏకంగా కంటతడిపెట్టారు. ఈ దృశ్యం చూసిన ప్రధాని శివన్ ను కౌగిలించుకుని..కొద్దిసేపు ఓదార్చి..ధైర్యం చెప్పారు.

సాధించిన విజయం ఏమీ తక్కువ కాదని..భవిష్యత్ లో మరిన్ని విజయాలకు సిద్ధంగా ఉండాలని సూచించి ముందుకెళ్లారు. మిషన్‌ ప్రారంభం నుంచి పడిన శ్రమ, ఇస్రో కీర్తిని.. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందనే భావనతో శివన్ కంటతడి పెట్టారు. ఈ దృశ్యం ఎంతో మందిని కలచి చేసింది. సోషల్ మీడియాలో అందరూ ఇస్రోకు మద్దతుగా అండగా నిలుస్తూ తమ కామెంట్లు పెడుతున్నారు. విక్రమ్ ల్యాండర్‌తో సిగ్నల్స్‌ తెగిపోయిన వేళ తల దించుకుని ఉన్న శివన్‌ ఫొటోను షేర్‌ చేస్తూ...‘మీరు సాధించింది చిన్న విషయమేమీ కాదు. మీ అంకిత భావానికి, కఠిన శ్రమకు భారత పౌరులంతా సలామ్‌ చేస్తున్నారు. మీరు తలెత్తుకుని ఉండండి సార్‌’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు.

Next Story
Share it