Telugu Gateway
Latest News

డీజిల్..పెట్రోల్ కార్లను నిషేధించం

డీజిల్..పెట్రోల్ కార్లను నిషేధించం
X

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వానికి దేశంలో డీజిల్, పెట్రోల్ కార్లను నిషేధించే ఆలోచన ఏదీలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా డీజిల్ కార్లపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఎక్కువ కాలుష్యానికి డీజిల్ కార్లు కారణం అవుతున్నాయనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అమ్మకాలు లేకుండా అల్లాడుతున్న ఆటోమొబైల్ పరిశ్రమను ఎలా గట్టెక్కించాలా? అనే అంశంపై కూడా కేంద్రం తర్జనభర్జనలు పడుతోంది. గత కొంత కాలంగా ఆటోమొబైల్ రంగం అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. పెద్ద ఎత్తున ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పోతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ కార్ల రద్దు అంశంపై ప్రకటన చేశారు. దేశ ఎగుమతులు, ఉపాధి రంగంలో ఆటోమొబైల్‌ రంగం పాత్రను ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు.

ఎగుమతుల్లో ఆటోమొబైల్‌ రంగం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. పెద్దసంఖ్యలో వాహనాలున్న దేశం ముడిచమురు దిగుమతుల విషయంలో సమస్యలు ఎదుర్కొంటోందని, ఇక కాలుష్యం, రహదారుల భద్రతలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. దేశంలో రూ 4.50 లక్షల కోట్ల విలువైన ఆటోమొబైల్‌ రంగం పరిశుభ్ర ఇంధనం వైపు మళ్లాలని పిలుపుఇచ్చారు. కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం ప్రజల్లో అనారోగ్య సమస్యలను వ్యాప్తి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story
Share it