కార్పొరేట్ రంగంపై సర్కారు వరాల వాన

మాంద్యం బారిన పడకుండా ఉండేందుకు కేంద్రం వరస పెట్టి పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు పలు వరాలు ప్రకటించారు. దేశంలోని కంపెనీల కార్పొరేట్ పన్నును 34.94 శాతం నుంచి 25.17 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో మార్పులు చేయనున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, వృద్ధి రేటు పెంచేందుకు వీలుగానే కార్పొరేట్ పన్నులను తగ్గిస్తున్నట్లు తెలిపారు.
కార్పొరేట్ ట్యాక్స్ ను గణనీయంగా తగ్గించడంతో పాటు షేర్ల విక్రయం, మ్యూచ్‌వల్ ఫండ్స్ లో యూనిట్ల అమ్మకం ద్వారా సమకూరే క్యాపిటల్ గెయిన్స్ పై అదనంగా విధించిన సర్‌చార్జ్ నుంచి వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలను మినహాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్యాపిటల్ మార్కెట్‌లోకి నిధుల ప్రవాహాన్ని స్ధిరీకరించేందుకు ఇటీవల ఫైనాన్స్ చట్టం ద్వారా షేర్ల విక్రయంపై పొందే క్యాపిటల్ గెయిన్స్ పై అదనంగా విధించిన సర్‌చార్జ్ వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబానికి (హెచ్‌యూఎఫ్) వర్తించవని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడంతో పాటు పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు ఆమె పేర్కొన్నారు.