చిక్కినట్లే చిక్కి దూరమైన చంద్రుడు
అంతటా ఒకటే ఉత్కంఠ. చంద్రుడు చిక్కినట్టే చిక్కి దూరమయ్యాడు. భారత్ అంతరిక్షంలో మరో అద్భుత విజయాన్నిఅందుకోబోతుందని అందరూ శుక్రవారం అర్ధరాత్రివేళ కూడా నిద్రపోకుండా ఆ అద్భుత సన్నివేశాలను వీక్షించేందుకు టీవీల మందుకు కూర్చున్నారు. కోట్లాది మంది గుండెచప్పుడు ఆ చంద్రుడి చల్లటి వాతావరణంలో ఎవరికి వారికి వినపడే పరిస్థితి. చాలా వరకూ అంతా సవ్యంగానే సాగింది. ఇక విజయం అందుకోవటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో సాంకేతిక సమస్య. చంద్రుడికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్స్ కట్ అయ్యాయి. అంతే ఒక్కసారిగా అంతా నిశ్సబ్దం . ఏమి జరిగిందో అంటూ ఆరా. కొద్దిసేపటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ అంశంపై ఓ ప్రకటన చేశారు. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని తెలిపారు.
డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను ఆసాంతం వీక్షించిన ప్రధాని మోడీకి శివన్ ఈ విషయం తెలియజేయగా.. ఆయన ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు మీరు సాధించింది తక్కువ ఏమీ కాదని శివన్ భుజం తట్టారు. ధైర్యంగా ముందుకెళ్లండి.. నేను మీకు అండగా ఉంటాను అని ప్రధాని వారిలో భరోసా కల్పించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్ -2 తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ్ ల్యాండర్ పయనం అక్కడ గతి తప్పింది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘చంద్రయాన్ –2 ప్రాజెక్టులో పనిచేసిన శాస్త్రవేత్తలందరిలోనూ ఎంతో ఉత్కంఠత ఉంది.
ఎందుకంటే ఈ ప్రయోగం చాలా సంక్లిష్టమైనది. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చాలా సున్నితమైన ప్రక్రియ అని.. అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఉయ్యాలలో ఎంత జాగ్రత్తగా వేస్తామో ఇది కూడా అంతేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు, పొరుగుదేశం భూటాన్‌కు చెందిన యువత కూడా తనతోపాటు ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారని... వీరంతా ఇస్రో నిర్వహించిన స్పేస్ క్విజ్‌లో తమ ప్రతిభను కనపరచిన వారని మోదీ తెలిపారు. మై గవ్ వెబ్‌సైట్‌లో నిర్వహించిన స్పేస్ క్విజ్‌లో భారీ సంఖ్యలో యువత పాల్గొనడం అంతరిక్షం, సైన్స్ పట్ల దేశ యువతలో ఆసక్తి పెరుగుతోందనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ అపురూప ఘట్టాన్ని దూరదర్శన్ శుక్రవారం అర్ధరాత్రి 1.10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టగా ఇస్రో తన వెబ్‌సైట్‌లోనూ కార్యక్రమ లైవ్ వీడియోను అందించింది.