Telugu Gateway
Latest News

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు
X

ఏపీ, తెలంగాణల్లో ప్రాజెక్టులు ఇప్పుడు నిండు కుండలా కళకళలాడుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు..వరదలకు నీరు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. ఇఫ్పటికే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తగా..సోమవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తేశారు. వరసగా మూడు రోజులు సెలవులు రావటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పోటీలు పడుతున్నారు. సాగర్ లోని 20 గేట్లను ఎత్తి నీటిని సోమవారం నుంచి దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు నీరు భారీ ఎత్తున చేరింది. జూరాల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది.

శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంకా ఏడు లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి 8.51 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆయా ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి కూడా మొదలైంది. రాబోయే కొన్ని రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి పదేళ్ళ తర్వాత అటు శ్రీశైలం, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి సామర్ధ్యానికి చేరుకున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలకు సుమారు మరో రెండేళ్ళ పాటు తాగు, సాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంచనా వేస్తున్నారు.

Next Story
Share it