Telugu Gateway
Latest News

ఐఏఎస్ కారు ఢీకొని జర్నలిస్టు మృతి

ఐఏఎస్ కారు ఢీకొని జర్నలిస్టు మృతి
X

ఆయన ఓ ఐఏఎస్ అధికారి. మోతాదుకు మించి మద్యం సేవించారు. అంతే కాదు..అడ్డగోలుగా కారు నడిపి ఓ జర్నలిస్టు మృతికి కారణం అయ్యారు. అయితే ప్రమాదానికి గురైన సమయంలో తాను కారు నడపలేదని..తనతో పాటు ఉన్న మహిళ కారు నడిపారని ఐఏఎస్ అధికారి వాదిస్తున్నారు. కానీ ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఐఏఎస్ అధికారే కారు నడిపారని చెబుతున్నారు. పోలీసు అధికారులు నిజ నిర్దారణ కోసం సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కేరళకు చెందిన శ్రీరామ్‌ వెంకటరామన్‌ అనే ఐఏఎస్‌ అధికారి కారు వేగంగా నడిపి బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రముఖ మలయాళ పత్రిక ‘సిరాజ్‌’ బ్యూరో ఛీఫ్‌ మహమ్మద్‌ బషీర్‌(35) మృతి చెందారు.

శనివారం తెల్లవారుజామున త్రివేండ్రం మ్యూజియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో అఫ్జా అనే మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్‌పై ఉన్న బషీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటరామన్‌ మోతాదుకి మించి మద్యం సేవించినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. బషీర్‌ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

Next Story
Share it