గ్రీన్ కార్డు బిల్లుకు అమెరికా సెనేట్ గ్రీన్ సిగ్నల్

ప్రవాస భారతీయులకు శుభవార్త. అమెరికా సెనేట్ లో గ్రీన్ కార్డుల జారీకి సంబంధించిన కోటా పరిమితి ఎత్తేయాలంటూ పెట్టిన బిల్లుకు సభ ఆమోదం లభించింది. దీంతో ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. గ్రీన్ కార్డు లభించిన వారు అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవటంతోపాటు ఉద్యోగం చేసుకునేందుకు కూడా సర్వహక్కులు లభిస్తాయి. ఇప్పటి వరకూ ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతం మాత్రమే గ్రీన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. అయితే జనాభా ఎక్కువ ఉన్న దేశాలకు..తక్కువ జనాభా ఉన్న దేశాలకు ఒకే నిబంధన వల్ల భారతీయులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పుడు పరిమితి తొలగించటం వల్ల భారతీయులకు మేలు జరగనుంది. అమెరికా ప్రతి ఏటా ఉద్యోగ ఆధారిత (ఈబీ) వీసాల కింద ప్రతి సంత్సరం 1.4 లక్షల మందికి గ్రీన్ కార్డులు మంజూరు చేస్తోంది.
హెచ్ 1 బీ వీసాతో గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్న వారికి ఈ చట్టం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. గత కొంత కాలంగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన వలసదారుల దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఇక్కట్లకు తెరదించడానికి గత ఫిబ్రవరిలో ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్ యాక్ట్ (హెచ్‌ఆర్1044) బిల్లును భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హ్యారిస్ తన సహచరుడు మైక్‌లీతో కలిసి సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇదే తరహా బిల్లును కాంగ్రెస్ ప్రతినిధుల సభలో జో లాఫ్రెన్, కెన్‌బర్గ్ లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు సుమారు 3 లక్షల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుందని ఓ అంచనా.