‘చంద్రయాన్2’ సూపర్ సక్సెస్

భారత అంతరిక్ష చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం. అంతా రెడీ అయిన తర్వాత..ఆగిపోయిన చంద్రయాన్ 2 సోమవారం నాడు సూపర్ సక్సెస్ అంటూ కేకలు వేసింది. శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి చంద్రయాన్ 2 ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లింది. ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహం బరువు 3.8టన్నులు. 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ ఉపగ్రహం సెప్టెంబర్ 7న జాబిల్లి మీద అడుగు పెట్టనుంది. చంద్రుని మూలాలు కనుగొనడానికి ఉద్దేశించి భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించారు.
బయలుదేరిన 16:13 నిమిషాల తర్వాత చంద్రయాన్-2 నిర్ణీత కక్ష్యలోకి సమర్థవంతంగా ప్రవేశించింది. కక్ష్యలోకి ప్రవేశించాక వాహన నౌక నుంచి చంద్రయాన్-2 ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. ఉపగ్రహాన్ని చంద్రుని దక్షిణ ధృవంలో ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడిన పని కాగా.. చంద్రునిపై క్లిష్టమైన సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నమిది. ఆర్బిటల్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయాక 15 నిమిషాల అత్యంత కీలకం. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోదేశంగా ఖ్యాతి గడించనుంది. ఇప్పటి దాకా రష్యా, అమెరికా, చైనాకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి.