Telugu Gateway
Latest News

కేఫ్ కాఫీ డే సిద్దార్ధ ఆత్మహత్య కలకలం

కేఫ్ కాఫీ డే సిద్దార్ధ ఆత్మహత్య కలకలం
X

అనుమానాలే నిజం అయ్యాయి. కేఫ్ కాఫీ డే అధినేత వీ జీ సిద్దార్ధ మృతదేహం బయటపడటంతో ఒక్కసారిగా కలకలం. దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు..మరో వైపు పీకల్లోతు అప్పులు..ఓ మాజీ ముఖ్యమంత్రి అల్లుడు. అయినా సరే ఆయనకు బతకటానికి ధైర్యం చాల్లేదు. పోనీ అప్పులు ఏమైనా ఆస్తుల కంటే మరీ ఎక్కువగా ఉన్నాయా? అంటే అదేమీ కాదు. అయినా ఎందుకీ పరిస్థితి. మిగిలిన పారిశ్రామికవేత్తల వలే విదేశాలకు పారిపోకుండా ఏకంగా ఆయన ప్రాణాలే తీసుకున్నాడు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా సిద్దార్ధ ఆత్మహత్యే పెద్ద అంశంగా మారిపోయింది. ఆయన ఆత్మహత్య పారిశ్రామిక వర్గాలతో పాటు దేశమంతటా పెద్ద కలకలం రేపింది. ఆయన మృతదేహం బుధవారం ఉదయమే నేత్రావతి నదిలో లభ్యమైంది. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్‌ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్‌.. ఆయన కోసం వెతికినా కనిపించలేదు. కుటుంబసభ్యులకు కారు డ్రైవర్‌ సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. భాగస్వామ్య సంస్థ నుంచి తీవ్రమైన వేధింపులు ఉన్నాయంటూ ఆయన పేర్కొనడం పారిశ్రామిక వర్గాలను షాక్ కు గురిచేసింది. సిద్ధార్థ అదృశ్య వార్తలతో కాఫీ డే షేరు ధర 20 శాతం కుప్పకూలింది.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సిద్ధార్థ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. తొలుత సిద్దార్ధ అదృశ్య వార్తను సిద్ధార్థ కుమారుడికి ఫోన్‌ చేసి డ్రైవర్‌ వెల్లడించాడు.. వారు కూడా స్థానిక కాఫీడే సిబ్బందికి తెలియజేసి గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి గాలింపు ప్రారంభించింది. సిద్ధార్థ అదృశ్యంపై అతని కారు డ్రైవర్‌ని మంగళూరు పోలీసులు ప్రశ్నించారు. సిద్ధార్థ కాల్‌ డేటా ఆధారంగా అన్ని కోణాల్లోనూ విచారణ సాగిస్తున్నారు. మంగళూరులో సిద్ధార్థ బస చేసే హోటళ్లు, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని హోటల్లు, బంధువుల ఇళ్లలోనూ గాలింపు చేపట్టారు. చివరకు అనుమానించినట్లుగా చిత్రావది నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ వ్యవహారం అంతా విషాదాంతం అయింది.

Next Story
Share it